హైదరాబాద్‌‌ నలువైపులా ఇండస్ట్రియల్‌‌ పార్కులు : మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు

హైదరాబాద్‌‌ నలువైపులా ఇండస్ట్రియల్‌‌ పార్కులు : మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు
  • పరిశ్రమలు పెట్టి యువతకు ఉద్యోగాలు కల్పిస్తం
  • పరిగి సెగ్మెంట్‌‌ ఎన్కతలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వికారాబాద్, వెలుగు: పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ నలువైపులా పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోందని చెప్పారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్‌‌పేట మండలంలోని ఎన్కతల గ్రామ శివారులో ఏర్పాటు చేసే పారిశ్రామికవాడలో 44.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మౌలిక సదుపాయాలు, అంతర్గత రోడ్ల నిర్మాణాలకు అసెంబ్లీ స్పీకర్‌‌‌‌ గడ్డం ప్రసాద్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి శ్రీధర్‌‌‌‌ బాబు శంకుస్థాపన చేశారు. 

అనంతరం మోమిన్‌‌పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మోమిన్  పేటలో ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడలో రెండేండ్లలో 5 వేల కోట్ల పెట్టుబడులను సాధించి 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనునట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడితే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. పరిశ్రమలు ఏర్పాటుకు స్థానికులు ముందుకు రావాలని, ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుందని చెప్పారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చినవారికి స్థలాలు కేటాయించి, సబ్సిడీలు అందజేస్తామన్నారు. వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కుటుంబాలను ఆదుకుంటామని శ్రీధర్‌‌‌‌ బాబు చెప్పారు.

వెయ్యి కోట్లతో అనంతగిరి టూరిజం డెవలప్‌‌మెంట్‌‌: గడ్డం ప్రసాద్

అన్ని రంగాల్లో వికారాబాద్‌‌ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పీకర్‌‌‌‌ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఇక్కడున్న ఖాళీ భూముల్లో పరిశ్రమలు పెడితే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వెయ్యి కోట్లతో అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. కోట్ పల్లి, సర్పన్ పల్లి, జుంటుపల్లి, లక్నాపూర్‌‌‌‌లాంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. 

జిల్లాలో 4 ప్రధానమైన రోడ్లను విస్తరించేందుకు కేంద్ర మంత్రి నితిన్‌‌ గడ్కరీని కలిసి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. జిల్లాలో రూ.600 కోట్లతో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆర్డీవో వాసుచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ కవిత, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.