కౌలు రైతును గుర్తించని తెలంగాణ ప్రభుత్వం

కౌలు రైతును గుర్తించని తెలంగాణ ప్రభుత్వం
  • పెట్టుబడి సాయం ఇయ్యరు, నష్ట పరిహారం అందదు 
  • అసలు రైతుగానే గుర్తించని రాష్ట్ర సర్కారు
  • సాగు చేసేది కౌలు రైతులు..పథకాల లబ్ధి భూ యజమానులకు
  • రాష్ట్రంలో సగానికిపైగా భూములు వ్యాపారులు, కాంట్రాక్టర్ల చేతుల్లోనే
  • 42 శాతం ‌‌భూమి కౌలు రైతుల సాగులో
  • కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకునేందుకూ అవకాశం ఉంటలే
  • రైతు స్వరాజ్య వేదిక స్టడీలో వెల్లడి
  • రైతు బంధు, బీమా, నష్టపరిహారం అందడం లేదని రిపోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: పంట పెట్టుబడికి సాయం అందదు.. బ్యాంకులు రుణాలివ్వవు.. పంట నష్టపోతే పరిహారం అందదు.. వచ్చిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో అవకాశం ఉండదు.. అసలు వారిని రైతుగానే గుర్తించదు సర్కారు. రాష్ట్రంలో కౌలు రైతుల దుస్థితి ఇది. సాగు కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో ఒక్కో కౌలు రైతు సగటున 2.60 లక్షల అప్పుల భారాన్ని మోస్తున్నట్లు రైతు స్వరాజ్య వేదిక నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. రాష్ట్రంలో ‌‌దాదాపు 42% ‌‌భూమి కౌలు రైతుల సాగులోనే ఉందని, వ్యవసాయం చేస్తున్న ప్రతి‌‌ ముగ్గురు రైతుల్లో ఒకరు కౌలుదారేనని, కానీ సర్కారు నుంచి వీరికి ఎలాంటి సాయం అందడం లేదని తేలింది. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో కౌలుదారులే ఎక్కువగా ఉంటున్నారన్న చేదు నిజం స్టడీలో వెలుగుచూసింది. ఆరు నెలలపాటు చేసిన స్టడీ రిపోర్టును రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కన్నెగంటి రవి, కొండల్ రెడ్డి, విస్సా కిరణ్ బుధవారం విడుదల చేశారు.

35.6 శాతం మంది కౌలు రైతులే

20 జిల్లాల్లోని 31 మండలాలకు చెందిన 34 గ్రామాల్లో 7,744 మంది రైతులపై రైతు స్వరాజ్య వేదిక స్టడీ చేసింది. వీరిలో 2,753 మంది (35.6 శాతం) కౌలు రైతులుగా తేల్చింది. అంటే రాష్ట్రంలో ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు కౌలుదారే. 2,753 మందిలో 523 మంది ఏమాత్రం భూమి లేని వారని గుర్తించింది. మిగతా వాళ్లు ఎంతో కొంత భూమి ఉండి, అది సరిపోక అదనంగా మరికొంత భూమిని కౌలుకు తీసుకుంటున్నరని వివరించింది. వీరిలో సన్నకారు రైతులు 78 శాతం, చిన్న రైతులు 24 శాతం ఉన్నట్లు పేర్కొన్నది. 2,753 మంది కౌలు రైతుల్లో బీసీలు 1,677 (61శాతం) మంది ఉన్నారు. తర్వాత 630 (23 శాతం) మంది ఎస్సీలు, 266 (10 శాతం) మంది ఎస్టీలు, 115 (4శాతం) మంది ఓసీలు, ముస్లిం మైనార్టీలు 65 (2 శాతం) ఉన్నట్లు గుర్తించారు. 73 శాతం కౌలు రైతులు ఒకే భూ మిని మూడేండ్ల కంటే ఎక్కువ రోజులుగా కౌలుకు సాగు చేస్తున్నారు.

ఒక్క పథకమూ ఇస్తలే

రాష్ట్రంలో 64 లక్షల మందిని రైతులుగా గుర్తించి సర్కారు రైతుబంధు ఇస్తున్నది. 36 లక్షల మందికి రైతు బీమా ఇస్తున్నది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల్లో 35.6 శాతం మంది కౌలుదారులేనని, వీరి సంఖ్య 22 లక్షలకు పైగా ఉంటుందని రైతు స్వరాజ్య వేదిక పరిశీలనలో తేలింది. కానీ వీరిలో ఎవరికీ రైతు సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. భూమి పట్టా లేక రైతు బంధు, బీమా, పంట రుణాలు అందడం లేదు. అప్పులు చేసి సాగు చేస్తే.. పంట ఆగమై పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు పైసా పరిహారం అందడం లేదని బాధిత కు టుంబాలు కన్నీళ్లుపెట్టుకుంటున్నాయి. బ్యాంకు పంట రుణాల నిబంధనల ప్రకారం.. రైతులకు తాకట్టు లేకుండా రూ.లక్షా 60 వేల వరకు అప్పు ఇవ్వాలి. రూ.లక్ష వరకు 12 నెలలు వడ్డీ లేని రుణం, తనఖా పెడితే రూ.3 లక్షల వరకు 4 శాతం వడ్డీతో,  ఆ మొత్తం దాడితే 7% వడ్డీతో రుణం అందించాలి. కానీ కౌలు రైతులకు పట్టాపాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లు లేక బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలు, పంట రుణాలు అందడం లేదు. కొంత భూమి ఉన్న కౌలు రైతులకూ రుణాలు అందేది అంతంతమాత్రమే. సగటున కౌలు రైతు కుటుంబానికి రూ.2.6 లక్షల దాకా రుణం ఉన్నది.  

కౌలు చెల్లింపు 91% శాతం నగదు రూపంలోనే

రాష్ట్రంలో కౌలు రైతులు యజమానులకు 91 శాతం నగదు రూపంలోనే చెల్లిస్తున్నట్లు తేలింది. 7.5 శాతం మంది మాత్రమే పంట రూపంలో చెల్లిస్తుండగా, 1.3 శాతం పంట భాగస్వామ్యం పద్ధతిలో కౌలు చెల్లిస్తున్నారు. 38.3 శాతం మంది ఒప్పందం సమయంలోనే పూర్తిగా కౌలు చెల్లిస్తున్నారు. 20.5 శాతం మంది సగం ముందు, సగం తర్వాత చెల్లిస్తున్నారు. 41 శాతం మంది పంట కోతల తర్వాత కౌలు ఇస్తున్నట్లు  వెల్లడైంది.

పత్తి ఎక్కువ వేస్తున్నరు

ప్రధానంగా పత్తి, వరి పంటలను కౌలుకు సాగు చేస్తున్నారు. 39 శాతం కౌలు రైతులు పత్తి పంటే వేస్తున్నారు. వరితో పాటు మక్క, మిరప, కంది పంటలు 37 శాతం మంది పండిస్తున్నారు. సగటున పత్తికి ఎకరానికి రూ.14,834, వరికి రూ.15,647 కౌలుగా కడుతున్నారు.

పంట అమ్ముకోవాలన్నా కష్టాలే

పట్టా పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ ఉంటేనే కొనుగోలు కేంద్రాల్లో వడ్లు, పత్తి అమ్ముకునే వీలుంది. సర్వేలో పాల్గొన్న 2,753 మందిలో 1,225 మంది ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోగా, ఇతర కారణాల వల్ల 606 మంది బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో అమ్ముకున్నరు. క్రాప్‌‌‌‌‌‌‌‌ బుకింగ్‌‌‌‌‌‌‌‌లో భూమి యజమాని పేరు నమోదు కాక 15 శాతం మంది,  ఎరువులు అప్పుగా తీసుకున్న వ్యాపారులకు 14 శాతం మంది అమ్ముకున్నరు.

సాయమేదీ?

ప్రకృతి వైపరీత్యాలతో 33 %కంటే ఎక్కు వగా మంది కౌలు రైతులు నష్టపో తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి పరి హారం అందలేదు. గత 2021లో 1,422 మంది, 2020లో 895 మంది 2019లో 666 మంది, 2018లో 304 మంది పంట నష్ట పోయినట్లు సర్వేలో పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న కౌలు రైతుల్లో 2,678 మంది (97.3 శాతం)కి రైతుబంధు అంద లేదని తేలింది. భూయజమానికి రైతు బంధు అందడం ద్వారా 17 మందికి (0.6 శాతం) కౌలు తగ్గించారని, మొత్తాన్ని యజమాని తమకే ఇచ్చారని 10 మంది (0.4 శాతం) కౌలు రైతులు చెప్పగా, యజమాని రైతుబంధులో కొంత సాయం చేశారని 0.1 శాతం మంది చెప్పారు.

సర్కారు లెక్కలు తప్పినయ్

కౌలు రైతులు ఎక్కువ లేరనే సర్కారు లెక్క తప్పని తేలింది. కౌలు భూమి 17.5 శాతం అని అధికారిక లెక్కలు చెబుతుండగా.. క్షేత్రస్థాయి పరిశీలనలో ఇది రెట్టింపు కన్నా ఎక్కువేనని స్పష్టమైంది. దాదాపు 42% భూములు కౌలు రైతుల సాగులోనే ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. సాగు చేసినా చేయకున్నా భూమి ఉన్న వారినే రైతుగా సర్కారు పరిగణిస్తున్నది. వారికే రైతు బంధు, పంట రుణాలందుతున్నాయి. అన్ని వ్యవసాయ సబ్సిడీ పథకాలు కూడా భూమి యజమానులు పొందుతున్నారు. దీంతో నిజంగా వ్యవసాయం చేసే వారు నష్టపోతున్నారు. 50 శాతం మందికి పైగా వ్యవసాయం చేయని వారు లబ్ధి పొందుతున్నారు.