మేడిగడ్డ డిజైన్లు ఇవ్వాల్సింది సీడీవోనే..మూడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి: ప్రభుత్వం ఆదేశం

మేడిగడ్డ డిజైన్లు ఇవ్వాల్సింది సీడీవోనే..మూడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి: ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) తీరుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. మేడిగడ్డ డిజైన్లను ఇవ్వాల్సింది సీడీవోనేనని, మూడు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని తేల్చి చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి రిహాబిలిటేషన్ డిజైన్స్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచించినా.. ఇప్పటిదాకా స్పందించడం లేదు. డిజైన్స్ చెయ్యాలని ప్రభుత్వం చెప్తున్నా పట్టించుకోవడం లేదు. డిజైన్లు తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. 

దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీవోకు లేఖ రాసింది. ప్రాజెక్టుల డిజైన్ల బాధ్యత సీడీవోదేనని తేల్చి చెప్పింది. నిర్ణీత గడువులోగా ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను అందివ్వాలని ఆదేశించింది. డిజైన్లు ఇవ్వడం సీడీవో వల్ల కాకుంటే కనీసం పేరుపొందిన ఏజెన్సీల నుంచైనా డిజైన్లను తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి డిజైన్లను ఇవ్వడానికే నోడల్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ సీడీవో ఉందని, సీడీవోనే డిజైన్లు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. కన్సల్టెన్సీలను పెట్టుకోమని చెప్పడం సీడీవో పని కాదని ఘాటుగా స్పందించింది. గతంలో బరాజ్‌‌‌‌‌‌‌‌ల డిజైన్లను సమకూర్చింది సీడీవోనే అని గుర్తుచేసింది. 

ఈ నేపథ్యంలో సీడీవోనే ప్రస్తుతం కూడా డిజైన్లను ఇవ్వాలని ప్రభుత్వం సీఈ సీడీవోకు తేల్చిచెప్పింది. ఎన్‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌ఏ సూచించిన మేరకు బ్యారేజీ‌‌‌‌‌‌‌‌ల పునరుద్ధరణ పనులకు నిపుణుల సేవలు అవసరమైతే ఆ దిశగా సీడీవోనే చర్యలను చేపట్టాలని, పునరుద్ధరణ, సాంకేతిక నిపుణులైన ఏజెన్సీలను గుర్తించి వాటిని సంప్రదించాలని తెలిపింది. ఇకనైనా డిజైన్లకు సంబంధించి ఆయా అంశాలపై ఏజెన్సీలతో సంప్రదించి, రిపోర్టును ఇవ్వాలని, నిర్ణీత గడువులోగా బ్యారేజీ‌‌‌‌‌‌‌‌ల పునరుద్ధరణ పనుల డిజైన్లను ఇవ్వాలని ప్రభుత్వం సీఈ సీడీవోకు తేల్చిచెప్పింది.