- కొత్త ప్రాజెక్టుల కోసం ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్ పెట్టాలని సూచన
- మీటింగ్లో పాల్గొన్న భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ (హిల్ట్) ప్రాజెక్టును వేగవంతం చేయాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించేందుకు కలెక్టర్లతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని, అలాగే.. అసైన్డ్ భూములపై రెవెన్యూ శాఖతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.
శుక్రవారం సెక్రటేరియెట్‌లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ‘రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ’ సమావేశం జరిగింది. ఈ భేటీలో భట్టితో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలను సకాలంలో చేరుకోవడానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రుల బృందం స్పష్టం చేసింది.
ల్యాండ్ పూలింగ్ పై ప్రత్యేక దృష్టి
నగర పరిధిలో భూముల మోనిటైజేషన్, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. గతంలో ఉప్పల్ భగాయత్, మోకిలా, బుద్వేల్‌లలో ల్యాండ్ పూలింగ్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం మరో మూడు కొత్త ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయని మంత్రులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ వివరించారు. ఉప్పల్ భగాయత్ తరహాలోనే పారదర్శక విధానాలతో మరిన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టే అవకాశాలను గుర్తించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
మరోవైపు, జాతీయ స్థాయి జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీలో తెలంగాణకు కచ్చితంగా ప్రాతినిధ్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో ఉత్తరప్రదేశ్, హర్యానాల తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉందని, గత ఆరు నెలల్లో తీసుకున్న పటిష్ట చర్యల వల్ల జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ పెరిగిందని వాణిజ్య పన్నుల కమిషనర్ రఘునందన్ రావు వివరించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కూమార్ సుల్తానియా, ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, సీనియర్ అధికారులు శశాంక, కృష్ణ భాస్కర్, నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
