‘అసైన్డ్’ అక్రమాల లెక్క తీస్తున్రు!..‘అసైన్డ్ పాలసీ’ తెస్తామని గత సర్కారు లీకులు\

‘అసైన్డ్’ అక్రమాల లెక్క తీస్తున్రు!..‘అసైన్డ్ పాలసీ’ తెస్తామని గత సర్కారు లీకులు\
  • ఆ తరువాత  వేల ఎకరాల భూములు కొన్న నేతలు నాటి అక్రమ రిజిస్ట్రేషన్ల 
  • వివరాలు సేకరించాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు
  • ఇప్పటికే అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు, కొనుగోళ్లు జరపకుండా నిషేధిత జాబితాలో పెట్టిన రెవెన్యూ శాఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత పాలకుల అండదండలతో సాగిన ‘అసైన్డ్’ భూముల దందాపై ప్రస్తుత ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ‘అసైన్డ్ పాలసీ’ని తీసుకువస్తామంటూ గత సర్కారు ఇచ్చిన లీకులను ఆసరాగా చేసుకుని, ధరణి పోర్టల్ రాకముందు.. ఆ తర్వాత పెద్ద ఎత్తున సాగిన భూబాగోతాలపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఎన్నికల హామీ మేరకు అసైన్డ్ భూములకు ‘ఫ్రీహోల్డ్’ (యాజమాన్య హక్కులు) కల్పించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈలోపే రంగంలోకి దిగి నాటి అక్రమ రిజిస్ట్రేషన్ల గుట్టు రట్టు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది.

పేదలకు దక్కాల్సిన వేల ఎకరాల భూములను కాజేసిన నేతల లావాదేవీల లెక్క తేల్చేందుకు సర్కారు సిద్ధమవడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు, ఆ తర్వాత కూడా అసైన్డ్ భూముల చుట్టూ భారీ నెట్‌‌‌‌వర్క్ నడిచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అసైన్డ్ చట్టాలను తుంగలో తొక్కి, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు, రియల్టర్లు కుమ్మక్కై వేల ఎకరాలను చేతులు మార్చారు.

త్వరలోనే అసైన్డ్ పాలసీ రాబోతోందన్న ముందస్తు సమాచారంతో, అప్పట్లోనే గత అధికార పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు పేద రైతుల నుంచి తక్కువ ధరలకే ఈ భూములను లాక్కున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే జరిగిన వివాదాస్పద రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల వివరాలను సేకరించాలని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు అందాయి.  ధరణి వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ తహసీల్దార్​ ఆఫీసుల్లో ఉన్నప్పటికీ ధరణిలోని లొసుగులను ఆధారంగా చేసుకుని.. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు గుర్తించారు. కొందరు నోటరీల మీద ఒప్పందాలు చేసుకున్నారు.  

5.36 లక్షల ఎకరాలకు డిజిటల్​సైన్​ కాలే

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వివాదాస్పదంగా మారిన, చట్టవిరుద్ధంగా బదలాయింపులు జరిగిన అసైన్డ్ ల్యాండ్స్‌‌‌‌ను తదుపరి లావాదేవీలు జరగకుండా రెవెన్యూ శాఖ నిషేధిత భూముల జాబితా (22-ఎ)లో చేర్చింది. తద్వారా విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా బ్రేకులు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 24.25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

ఇందులో 5.36 లక్షల ఎకరాలకు ఇంకా డిజిటల్ సైన్ కాలేదు. కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల ఎకరాల అసైన్డ్​ భూములున్నాయి. ఆ తర్వాత ఆదిలాబాద్‌‌‌‌లో 1.77 లక్షలు, కామారెడ్డిలో 1.31 లక్షలు, మెదక్‌‌‌‌లో 1.49 లక్షలు, నల్గొండలో 1.41 లక్షలు, నిజామాబాద్‌‌‌‌లో 1.31 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. కాలక్రమేణా చాలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కొందరు ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నా, వారికి భూమి లేదు. 2022 మే 6న వరంగల్‌‌‌‌లో జరిగిన రైతు డిక్లరేషన్‌‌‌‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోడు రైతులు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ, విక్రయాలతోసహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.    

హక్కులు కల్పించేందుకు అసైన్డ్​ కమిటీలు 

అర్హులైన అసైన్డ్ భూముల లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. నిరుపేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములపై వారికి పూర్తి స్థాయి ‘ఫ్రీహోల్డ్’ హక్కులు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. దీనివల్ల లక్షలాది మంది పేద రైతులకు లబ్ధి చేకూరనుంది.

అందులో భాగంగానే  రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయిలో ‘అసైన్డ్ కమిటీల’ ఏర్పాటుకు సర్కారు యోచిస్తోంది. ఈ కమిటీలు.. నిజమైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు, గతంలో జరిగిన అక్రమ బదలాయింపులపై నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. అసైన్డ్ చేసి 20 ఏండ్లు పూర్తైన భూములకు హక్కులు కల్పించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

దీంతో చేతిలో అసైన్డ్​ పట్టాలు, మోకామీద భూమి ఉండి యాజమాన్య హక్కులు లేనివారు, రికార్డుల్లో భూమి ఉన్నా ఫీల్డ్‌‌‌‌లో లేక ఇబ్బందులు పడ్తున్న రైతులకు మేలు జరగుతుందని భావిస్తున్నారు. అసైన్డ్​ కమిటీలకు జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి చైర్మన్‌‌‌‌గా వ్యవహరించనున్నట్టు సమాచారం. కలెక్టర్ కన్వీనర్‌‌‌‌గా ఉంటారు. జిల్లాలోని ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు. 

వారి విషయంలో ఎంక్వైరీ చేసి ముందుకు !

రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమకు కేటాయించిన అసైన్డ్ భూములను కొన్నిచోట్ల అమ్ముకున్న అసలు లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచిస్తోంది. ఇటువంటి వివాదాస్పద భూములపై కేవలం రికార్డులను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా, క్షేత్రస్థాయిలో అసైన్డ్ దారులు ఇచ్చే ‘స్టేట్​మెంట్స్’ (వాంగ్మూలాలు) ఆధారంగానే ముందుకు వెళ్లాలని రెవెన్యూ యంత్రాంగం భావిస్తోంది.

ప్రస్తుతం సదరు భూమి అసలు కబ్జాలో ఎవరు ఉన్నారు? సదరు వ్యక్తులు ఎప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు? అనే పూర్తి స్థాయి వివరాలను క్షుణ్ణంగా సేకరించాలని అధికారులు నిర్ణయించారు. నిరుపేద అసైన్డ్ దారులను మోసం చేసి భూములు గుంజుకున్న అక్రమార్కుల గుట్టు రట్టు చేయడంతో పాటు, బలవంతపు కొనుగోళ్ల వెనుక ఉన్న అసలు వాస్తవాలను వెలికితీసేందుకే ప్రభుత్వం ఈ లబ్ధిదారుల స్టేట్‌‌‌‌మెంట్ల సేకరణకు ప్రాధాన్యత ఇస్తోంది.