
- మహిళా సంఘాలకు సర్కారు బాకీ 4 వేల కోట్లు
- వడ్డీ లేని రుణాల బకాయిలు చెల్లించని ప్రభుత్వం
- గత బడ్జెట్లో మిత్తి కోసం రూ.3 వేల కోట్లు కేటాయింపు
- హుజూరాబాద్ ఎలక్షన్ టైమ్‌లో కేవలం రూ.200 కోట్లే రిలీజ్
- మళ్లీ బడ్జెట్ టైమ్ వచ్చినా.. మిత్తి బకాయిలు కట్టని సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం మూడేండ్లుగా మిత్తి పైసలు చెల్లించడం లేదు. వడ్డీ లేని రుణాలు(వీఎల్ఆర్) తీసుకున్న మహిళా సంఘాల సభ్యుల నుంచి బ్యాంకు ఆఫీసర్లు ఏ నెలకానెలా ముక్కుపిండి మరీ మిత్తి వసూలు చేస్తున్నా.. ప్రభుత్వం ఆ పైసలు మహిళల ఖాతాల్లో జమచేస్తలేదు. పెండింగ్‌లో ఉన్న మిత్తి పైసలను పైసా బాకీ లేకుండా చెల్లించేందుకు నిరుడు బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించినా.. రిలీజ్ చేసింది రూ.200 కోట్లే. మళ్లీ బడ్జెట్ టైమ్ వస్తున్నా మిత్తి పైసల ఊసెత్తడం లేదు. 3 నెలలకోసారి చెల్లించాల్సిన బకాయిలు ఏటా పెరిగి మూడేండ్లలో రూ.4 వేల కోట్లకు చేరుకున్నాయి.
హుజూరాబాద్ ఎలక్షన్ టైంలో 200 కోట్లు విడుదల
వడ్డీ లేని రుణాలకు సంబంధించిన మిత్తి పైసలు చెల్లించేందుకు 2021–22 బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయించింది. మొదటి త్రైమాసికంలో రూ.750 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా.. నిరుడు జులైలో కేవలం రూ.200 కోట్లు ఇచ్చింది. అందులో ఎక్కువ మొత్తాన్ని హుజూరాబాద్ నియోజకవర్గానికే మళ్లించింది. తర్వాత పైసా కూడా ఇయ్యలేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో మహిళా సంఘాల నుంచి లబ్ధి పొందేందుకే ఈ డబ్బులు వినియోగించారనే విమర్శలు వచ్చాయి.
ఎన్నికలప్పుడే మహిళలు గుర్తుకొస్తరు..
రాష్ట్రంలో రూరల్, అర్బన్ ఏరియాలు కలిపి 5,80,345 మహిళా పొదుపు సంఘాలు ఉన్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పరిధిలో 3,99,120 డ్వాక్రా గ్రూపులు ఉండగా, 43,29,058 మంది సభ్యులు ఉన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పరిధిలో మరో 1,81,225 డ్వాక్రా గ్రూపులు ఉండగా, 19 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఏటా సెర్ప్ పరిధిలోని సంఘాలకు వివిధ బ్యాంకులు 10 నుంచి 12.5 శాతం వడ్డీతో రూ.10 వేల కోట్ల వడ్డీ లేని రుణాలిస్తున్నాయి. ఈ ఏడాది రూ.12 వేల కోట్లు రుణాలివ్వాలని సెర్ప్ అధికారులు పెట్టుకున్న టార్గెట్ పూర్తయ్యింది. ఇందులో నెలనెలా 97% గ్రూపులు కిస్తీలు, మిత్తి చెల్లిస్తుండటం, డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన లోన్లు తప్ప బ్యాంకులకు మరే ఇతర లోన్లు పెద్దగా రికవరీ కాకపోవడంతో ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రూ.10 లక్షల వరకు లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. మహిళలు సంఘటితంగా ఉండటంతో వీరిని ఓటు బ్యాంకుగానే ప్రభుత్వం చూస్తోందనే విమర్శలున్నాయి. అందుకే మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వారి ఓట్ల కోసం మొదటి నాలుగేండ్ల మిత్తి బకాయి రూ.1,900 కోట్లను చెల్లించింది. దీంతో మహిళల ఓట్లను తమ ఖాతాల్లో వేయించుకోవాలనే ఉద్దేశమే తప్ప.. చిత్తశుద్ధి లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లేటుగా కట్టిన కిస్తీకి మిత్తి బంద్
లోన్లు తీసుకున్న మహిళ సంఘాలు ప్రతి నెలా కిస్తీ చెల్లించాల్సిన తేదీకి ఒక్క రోజు లేటైనా.. ఆ నెల వడ్డీని తాము చెల్లించాల్సిన వడ్డీగా ప్రభుత్వం పరిగణించడం లేదు. ఏదైనా మహిళా సంఘం బ్యాంకులో ఇన్ టైమ్‌లో కిస్తీ చెల్లిస్తేనే ఆ నెల వడ్డీని ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీగా లెక్కగడుతున్నారు. కిస్తీని సకాలంలో చెల్లించకపోతే ఆ నెల వడ్డీని కోల్పోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. మహిళల విషయంలో మాత్రం రూల్స్‌ను కచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. వారి ఖాతాల్లో వడ్డీ డబ్బులను జమ చేయడాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.
5 లక్షల లోన్ దాటితే మిత్తి ఇస్తలే
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. వడ్డీ లేని రుణాల(వీఎల్ఆర్) స్కీమును తీసుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో డ్వాక్రా గ్రూపులకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తామని ప్రకటించింది. అధికారం చేపట్టినప్పటి నుంచి రూ.5 లక్షల లోన్ దాటితే వడ్డీ చెల్లించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ వర్తింపజేయాలని డ్వాక్రా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.