- రాబోయే రెండేళ్లలో బల్క్ ట్రాన్స్‌పోర్ట్, ఆటోమేటెడ్ డ్రైయింగ్ సిస్టమ్స్
- కూలీలు, లారీలు, గోడౌన్ల కొరతతో ఈసారి వడ్ల కొనుగోళ్లు లేట్
- కన్వేయర్ బెల్టులు, ఎలివేటర్లు సమకూర్చుకోవాలనే యోచన
హైదరాబాద్, వెలుగు: వరి ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేసి, అత్యాధునిక యాంత్రీకరణ వైపు అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుత సీజన్‌లో ఊహించని విధంగా ఎదురవుతున్న మానవ వనరుల కొరత, రవాణా అడ్డంకులకు శాశ్వత పరిష్కారం చూపాలంటే అంతర్జాతీయ సాంకేతికత ఒక్కటే మార్గమని సర్కారు భావిస్తోంది.
ఇందులో భాగంగానే ధాన్యం మిల్లింగ్, రవాణా రంగాల్లో లేబర్ వినియోగం తక్కువగా ఉంటూ.. అత్యంత వేగంగా పనులు పూర్తి చేసే వియత్నాం, జపాన్, చైనా దేశాల రైస్ మిల్లింగ్ ఆటోమేషన్ మోడల్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది. త్వరలోనే ఆ దేశాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
రాబోయే రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని కొనుగోలు వ్యవస్థలో ‘బల్క్ ట్రాన్స్‌పోర్ట్’ (విడి ధాన్యం రవాణా), కన్వేయర్ బెల్టులు, బకెట్ ఎలివేటర్లు, మెకనైజ్డ్ అండ్ ఆటోమేటెడ్ డ్రైయింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన యంత్రాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
సాంప్రదాయ బస్తాల పద్ధతికి స్వస్తి పలికి, డిజిటల్ టెక్నాలజీని జోడించడం ద్వారా అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి సమయం, శ్రమ వృథా కాకుండా చూడాలని ఇందుకోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్లో పనిచేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది.
రికార్డు దిగుబడులు.. మిల్లింగ్ సవాళ్లు
ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వరి సాగై, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. దాదాపు 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల మేర వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగా ఇందులో ప్రభుత్వం దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది.
ఈ భారీ రికార్డు దిగుబడులకు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యాన్ని, సేకరణ వేగాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. అయితే, ఉత్పత్తి పెరుగుతున్నా.. దానికి తగ్గట్టుగా మిల్లుల్లో మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికత లేకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో మన బియ్యానికి ఆశించిన స్థాయిలో గ్లోబల్ డిమాండ్ సాధించలేకపోతున్నామని, అందుకే మిల్లింగ్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాల వైపు నడిపించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇప్పటికీ పాత పద్ధతులే.. తీవ్ర ఇబ్బందులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన వేలాది కొనుగోలు కేంద్రాల (ఐకేపీ సెంటర్లు) వద్ద మండుటెండల్లో రైతులు వారాల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం తీవ్రమైన లేబర్, హమాలీల కొరత. ఒకేసారి లక్షలాది టన్నుల ధాన్యం మార్కెట్లకు వస్తుండటంతో బస్తాలు నింపడానికి, లారీల్లోకి లోడ్ చేయడానికి కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు రవాణా చేయడానికి లారీల కొరత, సేకరించిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు సరిపడా గోడౌన్లు లేకపోవడం కొనుగోళ్ల వేగాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది.
ఐకేపీ సెంటర్లకు తెచ్చిన ధాన్యంలో తేమ శాతం 17% కంటే ఎక్కువగా ఉండటంతో, దాన్ని ఆరబెట్టడానికి రైతులు రోడ్లపైనే రోజుల తరబడి శ్రమించాల్సి వస్తోంది. అకాల వర్షాలు వస్తే ఈ ధాన్యం తడిసి ముద్దయి ముక్కిపోతుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ధాన్యాన్ని కుప్పలుగా పోయడం, తూర్పారబట్టడం, తూకం వేయడం, ప్రతి 40 కిలోల ధాన్యాన్ని గన్నీ బ్యాగుల్లోకి (బస్తాలు) చేతితో నింపడం, ఆపై సూదితో కుట్టడం వంటి పనులన్నీ కూలీలే చేయాలి.
ఇందుకోసం 80 శాతం ఇతర రాష్ట్రాల కూలీలు, హమాలీల మీద ఆధారపడాల్సి వస్తున్నది. సమయానికి వారు రాకపోతే ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మిల్లింగ్ ప్రక్రియలోనూ మన రాష్ట్రంలో పాతకాలపు ఇబ్బందులే శాపంగా మారాయి.
లారీల ద్వారా వచ్చిన బస్తాలను మిల్లుల వద్ద అన్‌లోడ్ చేయడానికి, మిల్లింగ్ అయ్యాక మళ్లీ సివిల్ సప్లైస్ గోడౌన్లకు చేర్చడానికి రోజుల తరబడి సమయం పడుతోంది. పైగా సాంప్రదాయ పద్ధతిలో పొట్టు తీసే క్రమంలో ‘నూక’ శాతం 30% నుంచి 40% వరకు వస్తుండటంతో మిల్లర్లు నష్టపోతున్నారు.
టెక్నాలజీలో టాప్.. లేబర్ ఫ్రీగా!
జపాన్, చైనా దేశాల్లో వరి ధాన్యం కొనుగోలు నుంచి మిల్లింగ్ వరకు సాగే ప్రక్రియ అంతా హమాలీలు, కూలీల అవసరం లేకుండా కేవలం ‘డిజిటల్ ప్రెసిషన్, రోబోటిక్స్’ పైనే నడుస్తోంది. ‘వర్టికల్ రీ-సర్క్యులేటింగ్ డ్రైయర్స్’ ద్వారా కేవలం గంటల్లోనే తేమ శాతాన్ని కచ్చితమైన 14%కి తెస్తున్నారు. అలాగే ‘హైడ్రాలిక్ ట్రక్ టిప్పర్ల’ ద్వారా ఒక్క హమాలీ కూడా లేకుండా నిమిషంలో లారీ ధాన్యాన్ని అండర్ గ్రౌండ్ హాపర్లలోకి అన్‌లోడ్ చేస్తున్నారు.
జపాన్‌లో రైతులు తాము పండించిన ధాన్యాన్ని బస్తాల్లో కాకుండా, సెన్సార్లతో కూడిన ప్రత్యేక ‘బల్క్ కంటైనర్ల’ ద్వారా నేరుగా ప్రభుత్వ ఆధీనంలోని ‘రైస్ ఫెసిలిటీ సెంటర్లకు’ (కంట్రీ ఎలివేటర్లు) తరలిస్తారు. అక్కడ లారీలు రాగానే ‘ఆటోమేటిక్ టిప్పర్ల’ ద్వారా ధాన్యాన్ని అండర్ గ్రౌండ్ హాపర్లలోకి అన్‌లోడ్ చేసి, రోబోటిక్ ఆర్మ్స్, కన్వేయర్ బెల్టుల సహాయంతో ఐఓటీ ఆధారిత ‘సైలో’ స్టోరేజ్ ట్యాంకుల్లో... చైనాలో సైతం మిల్లింగ్ కేంద్రాల వద్దకు వచ్చే విడి ధాన్యం తేమ శాతాన్ని ‘కంప్యూటరైజ్డ్ వర్టికల్ డ్రైయింగ్ సిస్టమ్స్’ క్షణాల్లో నియంత్రిస్తుండగా, ‘ఏఐ కలర్ సార్టర్లు’ గింజ క్వాలిటీని బట్టి సెకన్లలో గ్రేడింగ్ పూర్తి చేస్తున్నాయి.
చివరగా బియ్యం ప్యాకింగ్, లారీల లోడింగ్ దశల్లోనూ మనుషుల శ్రమ లేకుండా ‘రోబోటిక్ ప్యాలెటైజర్లు’, సుమారు ఒక టన్ను బరువును సైతం అవలీలగా ఎత్తే ‘ఫోర్క్‌లిఫ్ట్’ యంత్రాలనే వాడుతున్నారు. ఫలితంగా.. వందల టన్నుల ధాన్యం చేతులు మారుతున్నా, ఎక్కడా ఒక్క హమాలీ కూడా భుజంపై బస్తా మోయాల్సిన పని లేకుండా ఈ రెండు దేశాలు దాదాపు వంద శాతం లేబర్-ఫ్రీ కొనుగోలు వ్యవస్థను అమలు చేస్తున్నాయి.
