
- మద్దతు ధర రూ.2400తో ప్రొక్యూర్ మెంట్
- వానాకాలంలో 6.44 లక్షల ఎకరాల్లో సాగు
హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో సాగైన మక్కలను కొనేందుకు సర్కారు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.2400 మద్దతు ధరతో మక్కలు కొనేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్కెట్లోని కొన్ని జిల్లాల్లో మద్దతు ధర కన్నా కొంత తక్కువకే వ్యాపారులు కొంటుండడంతో రైతులకు ఇబ్బంది రాకుండా సర్కారు రంగంలోకి దిగి మక్కలు మద్దతు ధరతో కొనేందుకు సమాయత్తవవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో మక్కల కొనుగోళ్లకు సంబంధించి కార్యాచరణ ప్రకటించనున్నారు.
వానాకాలంలో సాగైన మొక్కజొన్న పంట మార్కెట్‌కు భారీగా వస్తున్న నేపథ్యంలో అధికారులు కొనుగోళ్లపై కసరత్తు పూర్తి చేసి, ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంట చేతికొస్తున్న జిల్లాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈయేడు పెరిగిన పంట విస్తీర్ణానికి అనుగుణంగా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
6.44 లక్షల ఎకరాల్లో సాగు
వానాకాలంలో గతంలో ఎన్నడూలేని విధంగా మక్కలు 6.44 లక్షల ఎకరాల్లో వేసి రాష్ట్ర రైతాంగం రికార్డు సృష్టించారు. వానాకాలం మక్కల సాధారణ సాగు విస్తీర్ణం 5.21లక్షల ఎకరాలు కాగా, నిరుడు ఇదే టైమ్‌కు 5.23లక్షల ఎకరాల్లో మక్కల సాగు జరిగింది. ఈయేడు నిరుటి కన్నా 1.32 లక్షల ఎకరాలకు పైగా మక్కలు సాగైనట్లు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదిక తేల్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 96,882 ఎకరాల్లో సాగై టాప్‌లో ఉండగా తరువాత రంగారెడ్డి జిల్లాలో 68,654 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 62,566 ఎకరాల్లో సాగు జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో 56,906 ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లాలో 52,093 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 50,728 ఎకరాల్లో సాగయ్యాయి. మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా మక్కలు సాగు చేశారు. మక్కలు ఎకరానికి సగటున 27.70 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు నమోదైన సాగు విస్తీర్ణం ప్రకారం 17.85 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 8 లక్షల టన్నులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కనీసం 3 లక్షల టన్నుల మక్కలు రైతుల నుంచి మార్క్ ఫెడ్ కు వచ్చే అవకాశం ఉంది.
మార్కెట్‌కు వస్తున్న మక్కలు..
ముందస్తుగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మక్కలు మార్కెట్‌కు వస్తుండగా, ఇంకొన్ని జిల్లాల్లో మక్క పంట చివరి దశలో ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో పంట కోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్కెట్‌కు వస్తున్న మక్కలకు రూ.2150 నుంచి రూ.2200వరకు ధర పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే సగటున రూ.200వరకు తక్కువ పలుకుతుండడంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లకు సమాయత్తమవుతోంది.
అక్టోబర్ నుంచి మక్కలు మార్కెట్‌కు అధికంగా వచ్చే అవకా శం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘‘రైతులకు మద్దతు ధర కంటే తక్కువకు అమ్మి నష్టపోకుండా మక్కలు కొనుగోళ్లకు సంసిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోళ్లను చేపట్టడతాం. మార్కెట్ ధరలను బట్టి కొనుగోలు సెంటర్లను ప్లాన్ చేస్తామనీ మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.