తెలంగాణ ఆలూగడ్డకు భారీ డిమాండ్.. పండిస్తే చాలు డబ్బులే డబ్బులు

తెలంగాణ ఆలూగడ్డకు భారీ డిమాండ్.. పండిస్తే చాలు డబ్బులే డబ్బులు

రాష్ట్రంలో ఆలుగడ్డలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే డిమాండ్ కు తగ్గట్లు ఇక్కడ ఆలుగడ్డలు ఉత్పత్తి అవడం లేదు. తెలంగాణలో  2.04 లక్షల మెట్రిక్ టన్నుల ఆలుగడ్డల డిమాండ్ ఉండగా..కేవలం 32,747 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది.  రాష్ట్రంలో సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కలిపి మొత్తం 3376 ఎకరాల్లో ఆలుగడ్డల పంట సాగవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆలుగడ్డల సాగును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 


విత్తనాల సమస్య..

రాష్ట్రంలో బంగాళాదుంప సాగులో ప్రధానమైన సమస్య విత్తనాల లభ్యత. ప్రస్తుతం బంగాళాదుంప విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI), సిమ్లా, ఆగ్రా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొంతమంది వ్యాపారుల నుండి సేకరిస్తోంది. ఇతర రాష్ట్రాల నుండి విత్తనాలను సేకరించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.  రవాణా ఖర్చుల  భారీగా అవుతుండటంతో ..ఈ ఖర్చులను రైతులపై  మోపుతోంది. దీంతో బంగాళాదుంప పంటను సాగు చేసే రైతులకు ఉత్పత్తి వ్యయం 40 నుంచి -50 శాతం వరకు అవుతోంది. 

సమస్య పరిష్కారానికి..

విత్తన  సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ఉద్యానవన శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది.  నాణ్యమైన బంగాళాదుంప విత్తనాలను తక్కువ ధరలకే ఉత్పత్తి చేయడానికి ఎపికల్ రూటెడ్ కటింగ్ (ARC) విత్తన సాంకేతికతను అనుసరించాలని యోచిస్తోంది. 

దీని కోసం కొంత మంది రైతులతో సహా 15 మంది సభ్యుల బృందాన్ని బెంగుళూరులోని ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ (సిఐపి), యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ (యుహెచ్‌ఎస్) అధ్యయనానికి  పంపింది. అక్కడ వివిధ నర్సరీలు, టిష్యూ కల్చర్ ల్యాబ్‌లు, ఫీల్డ్‌లను సందర్శించిన తర్వాత ఈ  బృందం రాష్ట్రంలో ARC సాంకేతికతను ప్రోత్సహించడానికి కార్యాచరణను రూపొందించింది.  దీని ప్రకారం బెంగుళూరులోని ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ (సిఐపి), యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ లో  ARC ద్వారా ఉత్పత్తి చేయబడిన విత్తనాలను ఈ వానాకాలంలో రైతులకు ఉచితంగా సరఫరా చేయనుంది. 

అలాగే జీడిమెట్ల, ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో బంగాళదుంప ఎపికల్ రూటెడ్ కటింగ్  కోసం ప్రత్యేకమైన విభాగాన్ని  సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఈ విభాగం  నుండి ఉత్పత్తి చేయబడిన బంగాళాదుంప విత్తనాలను  సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట రైతులకు రబీ పంట సీజన్‌లో సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు.  ఖరీఫ్, రబీ పంటల సీజన్‌లో ఉత్పత్తి పనితీరును పరిశీలించిన తర్వాత ఉద్యానవన శాఖ రాష్ట్రంలో ఏఆర్‌సీ సాంకేతికతను వాణిజ్య స్థాయిలో ప్రచారం చేయనుంది.