వడ్లు కొనుడు షురూ​.. ఇవీ మార్గదర్శకాలు

వడ్లు కొనుడు షురూ​.. ఇవీ మార్గదర్శకాలు
  • నిరుటి లెక్కనే ఊర్లల్లనే కేంద్రాలు
  • 135 లక్షల టన్నుల కొనుగోళ్ల అంచనా 
  • క్వాలిటీ బాధ్యత సెంటర్ల నిర్వాహకులదే
  • 50 క్వింటాళ్ల కంటే ఎక్కువ తీసుకొస్తే.. ఏవో లెటర్​ మస్ట్​

హైదరాబాద్, వెలుగు: వానకాలం సీజన్​కు సంబంధించి వడ్ల కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. పంట కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్​ చేసి, వడ్లు కొనాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఖరీఫ్​ వరి ధాన్యం కొనుగోళ్లపై సివిల్​సప్లయ్స్​డిపార్ట్​మెంట్​శనివారం గైడ్​లైన్స్​ విడుదల చేసింది. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగానే గ్రామాల్లోనే కొనుగోళ్లు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. 

రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు ఖరీఫ్​లో ఏర్పాటు చేసిన విధంగా దాదాపు 6 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ధాన్యం నాణ్యత పరిశీలన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకే అప్పగిస్తూ ఈసారి కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం నాణ్యతలో ఏమైనా ఇబ్బందులుంటే అందుకు వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రికార్డు స్థాయిలో ఈ సీజన్​లో 135 లక్షల టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నిరుడు వానకాలంలో ప్రభుత్వం 48.85 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఐకేపీ, ప్యాక్స్, డీసీఎంఎస్, జీసీసీ కేంద్రాలతో కొనుగోళ్లు చేపట్టనున్నారు. వరి ధాన్యం గ్రేడ్​1 క్వింటాలుకు రూ.1960, గ్రేడ్​2 రూ.1940 ఎంఎస్పీ చెల్లించనున్నారు.

ఇవీ మార్గదర్శకాలు
కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చే రైతు అకౌంట్లో మాత్రమే ధాన్యం డబ్బులను జమ చేయాలి.
రైతుకు బ్యాంకు అకౌంట్ లేకుంటే కచ్చితంగా కొత్త ఖాతా తెరవాల్సిందే. ఒక రైతు ధాన్యం డబ్బులు మరొకరి ఖాతాల్లో జమ చేయరు. ఆధార్ నంబర్ చెక్ చేసి ధాన్యం కొనుగోలు చేస్తారు. 
కొనుగోలు కేంద్రంలో అవసరమైన సౌకర్యాలను మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయాలి. 
గ్రామాల్లో ఏఈవోల సాయంతో వరి పండించిన రైతుల వివరాలను సేకరించి, దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలి. ఒక రైతు 50 క్వింటాళ్లకు పైగా ధాన్యం తీసుకొస్తే తప్పనిసరిగా ఏఈవో లేదా ఏవోతో ధ్రువీకరణ పత్రం తీసుకురావాలి. 
మిల్లర్లు కస్టమ్​మిల్లింగ్​రైస్​తో పాటు నిర్ణీత క్వాంటిటీలో పోర్టిఫైడ్ రైస్ ఇవ్వాల్సి ఉంటుంది
ట్రక్ షీట్లలో అవకతవకలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. 
గతంలో టైమ్​కు సీఎంఆర్ రైస్ ఇవ్వని డిఫాల్ట్ మిల్లర్స్, ఇతర కేసులున్న మిల్లర్స్​కు ఈ సీజన్​లో ధాన్యం ఇవ్వొద్దు. 
వానాకాలం సీఎంఆర్ గడువును 2022 జులై 31వ తేదీ వరకు నిర్ణయించారు. 
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురైతే 1800-42500333, 1967 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
ప్రతి కేంద్రం వద్ద కరోనా రూల్స్​పాటించాలి. రైతులు ఒకే దగ్గర గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి.