ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డున పడ్డరు

ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డున పడ్డరు

7,500 మందిని జాబుల నుంచి తీసేశారు
సర్క్యులర్ జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ
గ్రామ కార్యదర్శులకు ‘ఉపాధి’ ఎఫ్ఏల బాధ్యతలు
ఆగస్టు 15లోగా శిక్షణ ఇవ్వాలంటూ జిల్లా అధికారులకు ఆదేశాలు
ఇన్నేండ్లుగా పని కల్పించినోళ్లకే ఉద్యోగం లేకుండా పోయిన దుస్థితి

హైదరాబాద్, వెలుగు: ఇన్నేండ్లుగా ఊర్లలోని పేద కుటుంబాలకు ఉపాధి హామీ కింద పని కల్పించిన వారికే ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. పదిహేనేండ్లుగా అమలవుతున్న ఉపాధి హామీ స్కీంలో రాష్ట్ర సర్కారు కీలక మార్పులు చేసింది. గ్రామాల్లో పనుల ఎంపిక, జాబ్ కార్డుల జారీ, కూలీలకు పని కల్పన వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఫీల్డ్అసిస్టెంట్ (ఎఫ్ఏ) వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డ్యూటీని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. ఈ మేరకు ఉపాధి హామీ స్కీం బాధ్యతలపై గ్రామ కార్యదర్శులకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆగస్టు 15లోపు ట్రైనింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అన్ని జిల్లాల డీఆర్డీఏర్డీలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ఒక రోజు, మండల కేంద్రాల్లో రెండు రోజుల చొప్పున ట్రైనింగ్ ఇవ్వాలని.. గ్రామాల్లోని ఇతర కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా బ్యాచ్ల వారీగా సెలెక్ట్ చేసి పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆరు నెలలుగా ప్లాన్ చేసి..
కొత్త పంచాయతీల ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని 8,690 పంచాయతీల్లో ఏడున్నర వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేసేవారు. కొందరికి ఒకటి కంటే ఎక్కువ పంచాయతీల బాధ్యతలు ఉండేవి. కానీ రాష్ట్ర సర్కారు 6 నెలల కింద ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టింది. ఉపాధి హామీ పనులు పంచాయతీల ఆధ్వర్యంలోనే జరగాలని నిర్ణయించింది. గ్రామ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించేందుకు వీలుగా ప్రతిపాదనలు రెడీ చేసింది. అదే టైంలో జాబ్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు సగటున 30కిపైగా పనిదినాలు కల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.10 వేలు, అంతకంటే తక్కువ పని దినాలు కల్పించిన వారికి రూ.5 వేలే జీతమిచ్చేలా మార్పులు చేస్తూ సర్కారు ఈ ఏడాది మార్చిలో సర్క్యులర్ జారీ చేసింది. పని దినాల సగటు 10లోపు ఉన్న వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. దీనిపై అప్పట్లో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగారు. ఆ సమ్మెను సాకుగా చూపి వాళ్లను తొలగించేందుకు సర్కారు ప్లాన్ చేసింది. డ్యూటీకి రావడం లేదంటూ 7 వేల మందిని తొలగిస్తూ నిర్ణయ్ణం తీసుకుంది. సమ్మెకు దూరంగా ఉన్న కొందరు ఫీల్డ్ అసిస్టెంట్ల టర్మ్నుకూడా పొడిగించలేదు. కొనసాగిస్తరని వాళ్లు అనుకన్నా తాజా సర్కారు నిర్ణయంతో వారి ఆశలూ అడియాసలయ్యాయి.

15 ఏండ్లుగా పనిచేస్తున్నా..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీం అమల్లోకి వచ్చిన 2005లోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో కాంట్రాక్టు పద్ధతిపై ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించింది. దాదాపు 15 ఏండ్లుగా వారు గ్రామాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఈ ఏడాది ప్రారంభం నుంచి కష్టాలు మొదలయ్యాయి. 15 ఏండ్లుగా ఇదే పని మీద ఆధారపడిన వాళ్లను ప్రస్తుత కరోనా టైంలో తొలగించడంతో పరిస్థితి దయనీయంగా మారింది.

For More News..

అన్నా.. రాఖీ పంపుతున్నా.. నేను రావట్లే..

వార్డెన్ నిర్లక్ష్యంతో 14 మంది అంధులకు కరోనా

సెక్రటేరియట్‌ ‌డిజైన్‌లో మార్పులు