సిరిసిల్ల నేతన్నలకు రూ.20 కోట్లు.. స్కూల్ యూనిఫాం డబ్బులు కార్మికుల అకౌంట్లలో జమ

సిరిసిల్ల నేతన్నలకు రూ.20 కోట్లు.. స్కూల్ యూనిఫాం డబ్బులు కార్మికుల అకౌంట్లలో జమ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలకు స్కూల్  యూనిఫాం క్లాత్  ఉత్పత్తి చేసిన అమౌంట్ ను ప్రభుత్వం రిలీజ్  చేసింది. రాజీవ్  విద్యా మిషన్, సర్వ శిక్ష అభియాన్ యూనిఫాం క్లాత్  కలిపి 1.12 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేశారు. దీనికి సంబంధించిన  డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా సర్కార్  స్కూళ్లలో చదివుతున్న స్టూడెంట్లకు యూనిఫాం అందించేందుకు క్లాత్​ తయారీ ఆర్డర్​ను ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చింది. గురుకులాలు, మోడల్  స్కూల్  విద్యార్థుల కోసం 63.84 లక్షల మీటర్లు, సర్వ శిక్ష అభియాన్  కింద 48.67 లక్షల మీటర్లతో కలిపి 1.12 కోట్ల మీటర్ల క్లాత్ ను సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేశారు.

రూ.20.86 కోట్లు రిలీజ్..

సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన క్లాత్ కు సంబంధించిన డబ్బులు రూ.20 .86 కోట్లు సిరిసిల్లలోని 127 మ్యాక్స్  సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మీటర్​ సూటింగ్స్  క్లాత్ కు రూ. 62.86, షర్టింగ్ కు రూ. 37.62, చున్నీ క్లాత్ కు రూ. 35.24  చొప్పున ధర నిర్ణయించారు.

నేత కార్మికుల హర్షం

గత సర్కార్  బతుకమ్మ చీరలను తయారు చేయించి రూ. 300 కోట్లు బకాయి పెట్టింది. దీంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అప్పుల్లో కూరుకుపోయింది. కాంగ్రెస్  సర్కార్  అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో రూ.100 కోట్లు రిలీజ్  చేసింది. విడుతల వారీగా బతుకమ్మ చీరల బకాయిలు పూర్తిగా చెల్లించి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వస్త్ర పరిశ్రమను గాడిలో పెట్టింది. 

ఈ ఏడాది ఇందిరమ్మ మహిళా శక్తి చీరలకు సంబంధించిన రూ.4.30 కోట్ల క్లాత్  ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందజేసింది. ఆర్వీఎం, ఎస్ఎస్ఏ ఆర్డర్లు ఇచ్చి ఏడాదంతా పని కల్పిస్తోంది. దీంతో సిరిసిల్ల నేతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది.