- చారిత్రక ప్రాంతాల పరిరక్షణకు రాష్ట్ర సర్కార్ చర్యలు
- ధూళికట్ట, నేలకొండపల్లి, ఫణిగిరి, గాజులబండ బౌద్ధ స్థూపాలు, చైత్యాల పునరుద్ధరణ
- తాజాగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర పురావస్తుశాఖ
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలోని నాలుగు ప్రధాన బౌద్ధారామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్ట, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి, గాజులబండ బౌద్ధ స్థూపాలు, చైత్యాల పునరుద్ధరణకు రూ.3.57 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ తాజాగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మూడు ప్రాంతాల్లోని బౌద్ధారామాల పనులను ఏడాదిన్నరలోగా, గాజులబండ వద్ద ఆర్నెళ్లలో కంప్లీట్ చేయాలని నిబంధన విధించింది.
ధూళికట్టకు దారి కరువు
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ పరిధిలోని ధూళికట్ట బౌద్ధ స్థూపం, చైత్యాలు, విహార సముదాయం నిర్లక్ష్యానికి గురైంది. ఆ ప్రాంతానికి వెళ్లడానికి సరైన రోడ్డు లేదు. నడిచి వెళ్లడమే కష్టంగా మారింది. దీంతో బౌద్ధులు, టూరిస్టులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏడేండ్ల కింద అప్పటి ఎంపీ బాల్క సుమన్ రూ.50 లక్షలు కేటాయించారు. ఆ నిధులతో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినా ముందుకు పడలేదు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ధూళికట్ట అభివృద్ధికి రూ.1.07 కోట్లు, నేలకొండలపల్లిలో బౌద్ధస్థూప అభివృద్ధికి రూ.1.21 కోట్లు మంజూరు చేసింది.
అంతర్జాతీయంగా ఎంతో ప్రసిద్ధి చెందినా..
సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలోని బౌద్ధ క్షేత్రం అంతర్జాతీయంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఆ స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు లేవు. బౌద్ధారామన్ని పరిరక్షించకపోవడంతో బౌద్ధ భిక్షువులు, పర్యాటకులను నిరాశకు గురిచేస్తోంది. ఫణిగిరి బౌద్ధారామ అభివృద్ధికి రూ.1.17 కోట్లు, ఇదే మండలం లోని గాజులబండ వద్ద బౌద్ధారామ అభివృద్ధికి రూ.17.37 లక్షలు మంజూరు చేసింది.
