పక్క రాష్ట్రాల్లో టైట్.. ఇక్కడ లైట్​!

పక్క రాష్ట్రాల్లో టైట్.. ఇక్కడ లైట్​!
  • రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు
  •     కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ
  •     చత్తీస్‌‌గఢ్​లో నైట్ కర్ఫ్యూ
  •     మహారాష్ట్ర, ఏపీలో పగటిపూటా ఆంక్షలు
  •     తమిళనాడులోనూ చర్యలు
  •     మన రాష్ట్రంలో కర్ఫ్యూలు, కఠిన ఆంక్షలు అక్కర్లేదంటున్న సర్కార్

హైదరాబాద్, వెలుగు: కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఒక్కొక్కటిగా రాష్ట్రాలన్నీ ఆంక్షల బాట పడుతున్నాయి. కర్నాటక ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ప్రతి శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల దాకా కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. తమిళనాడులో సండే పూర్తిగా లాక్‌‌డౌన్ పెట్టారు. మిగిలిన రోజుల్లో నైట్ కర్ఫ్యూ పెట్టారు. మహారాష్ట్రలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల దాకా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. డే టైమ్‌‌లో కూడా ఐదుగురికి మించి ఒకచోట గుమిగూడొద్దని ఉత్తర్వులిచ్చారు. స్విమ్మింగ్‌‌ పూల్స్‌‌, జిమ్ములు, బ్యూటీ సెలూన్లు, జూ పార్కులు, మ్యూజియాలు, ఇతర ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ పార్కులన్నీ బంద్ పెట్టారు. స్కూళ్లు, కాలేజీలకు ఫిబ్రవరి 15వ తేదీ దాకా సెలవులు ప్రకటించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, మాల్స్‌‌ వంటివన్నీ యాభై శాతం కెపాసిటీతో రాత్రి పది గంటల దాకా మాత్రమే నిర్వహిస్తున్నారు. చత్తీస్‌‌గఢ్ ప్రభుత్వం వారం రోజుల కిందనే నైట్ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. తాజాగా ఏపీ కూడా నైట్‌‌ కర్ఫ్యూ పెడుతున్నట్లు ప్రకటించింది. థియేటర్లు, మాల్స్‌‌, రెస్టారెంట్లను యాభై శాతం కెపాసిటీతో నడిపించుకోవాలని సూచించింది.

మరి మన దగ్గర కథేంది?

మన రాష్ట్రంలో పది రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 0.5 శాతం ఉన్న పాజిటివిటీ రేటు, వారం రోజుల్లోనే 3.57 శాతానికి పెరిగింది. దీంతో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్‌‌, మాస్‌‌ గ్యాదరింగ్‌‌పై నిషేధం విధిస్తూ మన రాష్ట్ర సర్కార్ ఆంక్షల పేరిట ఓ జీవో ఇచ్చింది. కానీ ఇది కేవలం కోర్టుకు చూపెట్టుకోవడానికే. అమలు మాత్రం కావడం లేదు. మంత్రులు సహా అందరూ ఈ జీవోను ఉల్లంఘిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ జనాలను పోగేసి సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆంక్షల జీవో ఇచ్చిన ప్రభుత్వమే.. ఊరూరా రైతు బంధు సంబురాలకు పిలుపునిచ్చింది. ప్రజాప్రతినిధులే అన్ని గ్రామాల్లో మీటింగ్స్‌‌ పెడుతున్నారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, లాక్‌‌డౌన్‌‌ వంటి కఠిన ఆంక్షలు విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు.