రైతుల దగ్గర మొలకెత్తిన ధాన్యం కొనాలి

రైతుల దగ్గర మొలకెత్తిన ధాన్యం కొనాలి
  • వైఎస్ షర్మిల డిమాండ్

వికారాబాద్: రైతుల దగ్గర ప్రతి గింజా కొంటామని చెప్పిన సీఎం కేసీఆర్ మాటకు కట్టుబడి మొలకెత్తిన ధాన్యం సహా ప్రతి గింజా కొనాల్సిందేనని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. పరిగి నియోజకవర్గం పరిధిలోని దోమ మండలం పోలెపల్లి తదితర గ్రామాల్లో వైఎస్ షర్మిల పర్యటించి రైతులతో మాట్లాడారు. భారీ వర్షాలకు తడిసి ముద్దయిన వరి కుప్పలను పరిశీలించి పరిస్థితిని రైతులతో అడిగి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు అంగీకరించట్లేదని, కనీస మద్దతును కల్పించకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు షర్మిలకు తమ కష్టాలు చెప్పుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ నివారించలేరని, అలాంటప్పుడు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా వైఎస్ షర్మిల అన్నారు. 
ఓ వైపు కరోనా కష్టాలు మరో వైపు రైతుల ఆర్తనాదాలు కనిపిస్తున్నాయని, వ్యవసాయం వల్లే కరోనా వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నామన్నారు. రైతుల సమస్యలు తీర్చడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయమంటే కొనడంలేదు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మొలకెత్తుతున్న పట్టించుకోవడం లేదు.. ఇదెక్కడి ప్రభుత్వమని విమర్శించారు. తాను వ్యసాయం చేసి ఎకరానికి కోటి లాభం తెచ్చే కేసీఆర్,  ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు ఈ విషయాలు తెలియవా అని షర్మిల ప్రశ్నించారు.

కేసీఆర్ రైతు వ్యతిరేకి, ఖమ్మం లో రైతులకు సంకెళ్లు వేయించిన  రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయరు, ఇంకో వైపు కొనుగోలు చేసిన వాటికి బిల్లులు ఇవ్వరు, పావలా వడ్డీ రుణాలివ్వరు.. రైతు బంధు సాయం విదల్చి రైతులు నోరెత్తొద్దని లంచంగా ఇస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం  ప్రతి గింజ కొనాలని, మొలకెత్తిన ధాన్యం కూడా కొనాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం...పోరాటం చేస్తామని షర్మిల హెచ్చరించారు.