సాగు బాగుకు సబ్సిడీ యంత్రాలు..రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు

సాగు బాగుకు  సబ్సిడీ యంత్రాలు..రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు
  • ఏడేండ్ల కింద బంద్ పెట్టిన బీఆర్ఎస్ సర్కార్  
  • సీఎం రేవంత్ ప్రత్యేక చొరవతో మళ్లీ పునరుద్ధరణ 
  • రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఆఫీసర్లు 
  • ఈ నెలాఖరు వరకు గ్రౌండింగ్​చేసే విధంగా ప్లానింగ్​
  • సాగు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచే దిశగా దృష్టి 

జయశంకర్ ​భూపాలపల్లి, వెలుగు: వ్యవసాయ సాగు పనులు చేసేందుకు రైతులకు కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. పంటల సాగులో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. మార్కెట్ లో ఆధునిక యంత్రాలు వచ్చినా చిన్న, సన్న కారు రైతులు కొనలేని పరిస్థితి ఉంది. గతంలో సబ్సిడీపై అందించే సాగు యంత్రాల పంపిణీ ఏడేండ్లుగా బంద్ పెట్టారు. దీంతో రైతులకు కూలీలు దొరకక, మరోవైపు యంత్రాలు లేక రైతులకు సాగు కష్టాలు తీవ్రమయ్యాయి.  ప్రస్తుత ప్రభుత్వం సబ్సిడీపై యంత్ర పరికరాలను అందించే పథకాన్ని మళ్లీ అమలులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో 1,515 యూనిట్లకు రూ.1.36 కోట్లు మంజురు చేసింది. 

ఏడేండ్ల తర్వాత మోక్షం 

సాగులో పెట్టుబడి ఖర్చులను తగ్గించి రైతుల ఆదాయం పెరిగేందుకు యంత్రాల అందజేత పథకానికి గత ప్రభుత్వం చేపట్టి...ఎడ్లతో నడిచే నాగలి, గుంటక, గొర్రు, చేతి పంపులు, పవర్​ స్ప్రేయర్లు, మిని ట్రాక్టర్లు, ట్రాక్టర్లు అందించింది. కాగా.. 2017 నుంచి బీఆర్ఎస్​సర్కార్ యంత్రాలపై రాయితీ స్కీమ్ ను బంద్ పెట్టింది. దీంతో చిన్న, సన్నకారు రైతులు బహిరంగ మార్కెట్ లో అధిక ధరలు పెట్టి కొనలేక చాలావరకు సాగు చేయడం మానేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్​ రెడ్డి మళ్లీ స్కీమ్ ను పునరుద్ధరించి నిధులు కేటాయించారు. తద్వారా రైతులు సబ్సిడీ యంత్రాల కొనుగోలుపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ గైడ్​లైన్స్ మేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ రాయితీ పథకానికి ఐదెకరాల్లో పు భూమి ఉన్న రైతులు అర్హులు. స్కీమ్ ను మళ్లీ అమలులోకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సబ్సిడీపై ఆధునిక యంత్రాల అందజేత 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ, మిగతా రైతులకు 40శాతం సబ్సిడీతో ఆధునిక యంత్రాలను పంపిణీ చేయనున్నారు. ఐదెకరాలకంటే తక్కువ భూములున్న రైతులకు సబ్సిడీపై వివిధ రకాల పరికరాలను అందించనున్నారు. ప్రధానంగా బ్యాటరీ, తైవాన్​స్పేయర్స్, డిస్క్ యారో, కేజీవీల్స్, సీడ్​కమ్ ఫర్టిలైజర్​మెషీన్, బ్రష్​కట్టర్, స్ర్టాబెలర్, బండ్ ఫార్మర్​వంటి పరికరాలు ఈ ఏడాది రైతులకు అందించేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

అర్హుల ఎంపికకు కమిటీలు

సబ్సిడీ యంత్రాలను అందించేందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసేందుకు ముందుగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మండల స్థాయి కమిటీలో అగ్రికల్చర్​ఆఫీసర్, తహసీల్దార్,ఎంపీడీవో ఉంటారు. రాయితీ రూ. లక్ష దాటితే జిల్లా కమిటీ అనుమతి తప్పనిసరి. జిల్లాస్థాయి కమిటీలో కలెక్టర్​చైర్మన్​గా, డీఏవో, ఆగ్రోస్​, అగ్రికల్చర్​ శాస్ర్తవేత్తలు సభ్యులుగా ఉంటారు. అర్హుల ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా స్కీమ్ ను  అమలు చేసే విధంగా ప్రణాళికను తయారు చేయనున్నారు.  

రైతులకు ఎంతో మేలు

ప్రభుత్వం రాయితీపై అందించే వ్యవసాయ పనిముట్లు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని సాగులో కూలీల కొరతను అధిగమించవచ్చు. మండలాల వారీగా రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నాం.  కటాఫ్​ డేట్​ప్రకారం కమిటీల ఆధారంగా రైతుల ఎంపిక  జరుగుతుంది.- జేడీ బాబురావు, డీఏవో, భూపాలపల్లి 

కూలీలు దొరుకుత లేరు

వ్యవసాయ పనులు చేసేందుకు కూలీలు దొరకడం లేదు. దీంతో పంటకాలం వెనక్కు పోతుంది. యంత్రాలతో నాలుగు రోజుల్లో చేసే పని ఒక్క రోజులోనే  పూర్తవుతుంది. పవర్​టిలర్లతోనే చేన్లలో పంటలు వేస్తున్నాం. వాటిని రాయితీపై ప్రభుత్వం అందించడం ఎంతో మేలు చేసినట్టవుతుంది. ట్రాక్టర్లు కూడా ఇవ్వాలి. - ఏడేల్లి సమ్మిరెడ్డి, రైతు, రేగొండ