- కేబినెట్ మీటింగ్‌లో చర్చించి డెసిషన్
- 24లోగా ప్రభుత్వ నిర్ణయం చెప్పాలన్న హైకోర్టు
- ఇంకా ఆలస్యం చేయొద్దని భావిస్తున్న సర్కార్
- ఎన్నికల సన్నద్ధతపై నివేదిక ఇవ్వాలని
- పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే ఆలస్యమైన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను వీలైనంత తర్వగా నిర్వహించాలనే నిర్ణయానికి సర్కార్ వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నెల 17న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్‌లో జరగనున్న కేబినెట్ మీటింగ్‌లోనే స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఈ నెల 24లోగా తెలియజేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్టు తెలుస్తున్నది. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం తేలకపోవడం వల్లే అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్పడడం, అది ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించినప్పటికీ పరిస్థితులు కలిసిరాలేదు.
ఈ క్రమంలో ఇటీవలి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో జోష్నెలకొన్నది. స్థానిక ఎన్నికలకు ఇదే అనువైన వాతావరణమని భావిస్తున్న సర్కార్.. ఎన్నికల సన్నద్ధతపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులను ఇటీవల ఆదేశించింది.
డిసెంబర్ మొదటి వారంలో ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలు, తెలంగాణ రైజింగ్ 2047 వంటి కార్యక్రమాలు ఉండడంతో.. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించడమా? లేదా అంతకంటే ముందే పెట్టడమా? అనే దానిపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
అదే ప్రధాన అజెండా..
ఈ నెల 17న నిర్వహించనున్న కేబినెట్ మీటింగ్‌లో స్థానిక ఎన్నికల అంశమే ప్రధాన అజెండాగా ఉండనుంది. దీనిపై మంత్రులందరితో చర్చించి, నిర్ణయం ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు, సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పిన అంశాలు, ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ముందున్న మార్గాలు లాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.
కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో సెప్టెంబర్29న రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్రిలీజ్ చేసింది. దీని ప్రకారం అక్టోబర్9న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ అదే రోజు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్9పై హైకోర్టు స్టే విధించింది. రిజర్వేషన్లపై స్టే రావడంతో హైకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరి పరిస్థితుల్లో అదే రోజున ఎన్నికల నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది.
కేబినెట్నిర్ణయం అనంతరం సాధ్యమైనంత త్వరగా మరోసారి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉన్నప్పటికీ, నిర్వహణకు సంబంధించిన పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చే కన్సెంట్ఆధారంగానే ఎన్నికల సంఘం ముందుకు వెళ్తుంది. దీంతో స్థానిక ఎన్నికల విషయంలో కేబినెట్ తీసుకోబోయే నిర్ణయమే ఫైనల్కానుంది.
బైపోల్ గెలుపుతో ముందడుగు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విజయం వల్ల వచ్చిన జోష్‌తో స్థానిక ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో వేల కోట్ల కేంద్ర నిధులు వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది.
గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేవారు లేకుండాపోయారు. దీంతో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడంతో పాటు పార్టీని కూడా బలోపేతం చేయవచ్చని సర్కార్ భావిస్తున్నది.
మరోవైపు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విధించిన గడువు కూడా దగ్గరపడ్తున్నది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం స్పీడప్ చేసినట్టు తెలుస్తున్నది.
