
- ఎకరంన్నర స్థలంలో భవన నిర్మాణానికి టెండర్
- గతంలోనే రూ.35 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
- ఆర్ అండ్ బీకి నిర్మాణ బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో భక్తులకు నిత్యాన్నదానం కోసం భవన నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆలయానికి సమీపంలో ఎకరంన్నర విస్తీర్ణంలో సువిశాల భవన నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన టెంపుల్ కావడంతో ఇక్కడికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
శివరాత్రి, ప్రత్యేక, పండుగ రోజుల్లో లక్షల సంఖ్యలో భక్తులు తరలొచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేయాలని భక్తులు తపిస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎంత మంది వచ్చినా.. ప్రశాంతంగా భోజనం చేసేలా రెండు అంతస్తుల భవనం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. నిత్యాన్నదాన సత్రం భవన నిర్మాణ బాధ్యతలు ఆర్ అండ్ బీకి అప్పగించారు.
ఇప్పటికే భవన నిర్మాణం కోసం సర్కార్ రూ. 35 కోట్లు మంజూరు చేసింది. 1990లో దసరా రోజున వేములవాడలో భక్తుల కోసం నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి దాతల సహకారంతో సోమవారం 500 మందికి, శుక్రవారం 400 మందికి, మిగతా రోజుల్లో 200 మందికి భోజనం పెడుతున్నారు. అన్నదాన సత్రం నిర్వహణకు ట్రస్టులో ఇప్పటికే రూ.20 కోట్లు ఉన్నట్లు తెలిసింది. ఆ మొత్తాన్ని రూ.వంద కోట్లుగా చేయాలని ప్రణాళిక రూపొందించారు. అయితే నిత్యాన్నదానం కోసం గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన కుటుంబం తరఫున రూ. 40 లక్షలు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన కుటుంబం తరఫున రూ.10 లక్షలు ప్రకటించారు.