- బాధితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి పొంగులేటి
- ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రశ్నకు క్లారిటీ
- ఇందిరమ్మ ఇండ్లను 22ఏ భూముల పరిధిలోకి చేర్చారన్న బీర్ల
- కమిటీ రిపోర్టు ఆధారంగా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి
- జర్నలిస్టులకు కనీస వేతనం, పెన్షన్ ఇవ్వాలని కూనంనేని డిమాండ్
- గురువారం జీరో అవర్ లో ప్రజా సమస్యలను సభ దృష్టికి తెచ్చిన సభ్యులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అసైన్డ్, గ్రామకంఠం భూముల్లో దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు హైలెవల్ కమిటీ వేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో గురువారం జీరో అవర్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఇండ్లను అధికారులు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన అంశాన్ని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లేవనెత్తారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో దశాబ్దాలుగా పేదలు ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారని.. ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు ఆ ఇండ్లు, ఇండ్ల జాగాలను 22ఏ జాబితాలో చేర్చారని చెప్పారు. దీని వల్ల ఒక్క యాదాద్రి జిల్లాలోనే 50 వేల ఇండ్లు నిషేధ జాబితాలోకి వెళ్లాయని, దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
ఆలేరు నియోజకవర్గంలో ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఆగిపోయాయని, సర్కారు తమ ఇండ్లను కూలుస్తుందని వారంతా భయపడ్తున్నారని, వెంటనే ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. ఇది ఒక్క ఆలేరు సమస్యే కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో హైలెవల్ కమిటీ వేసి, ఇతర రాష్ట్రాల్లోని విధానాలను స్టడీ చేసి, కేబినెట్ లో చర్చించిన తర్వాత అసెంబ్లీలో డిబేట్ పెట్టి తుది నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
జర్నలిస్టులకు కనీస వేతనం ఇవ్వాలి: కూనంనేని
రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కనీస వేతనం అమలు చేయాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్, అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల కొనుగోలుకు రాయితీలు ఇవ్వాలని సూచించారు. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. జర్నలిస్టుల సమస్యలను నోట్ చేసుకున్నామని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీలో అర్హత ఉన్న ఫ్యాకల్టీకి ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు తెలిపారు. యూజీసీ నిబంధనల ప్రకారం 47 మందికి ప్రమోషన్లు ఇవ్వలేదని, ప్రొఫెసర్ మనోహర్ అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో నీటి సమస్య రాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. నాచుపల్లి జేఎన్టీయూ విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించాలని విన్నవించారు.
జీరో అవర్ లో సభ్యులు లేవనెత్తిన మరికొన్ని సమస్యలు..
గంగూల కమలాకర్ (కరీంనగర్): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు 90 శాతం పెనాల్టీ మినహాయింపు ఇవ్వాలి.
ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్): తన నియోజకవర్గం మూడు కమిషనరేట్ల పరిధిలోకి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సైబరాబాద్ లేదా ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉంచాలని కోరారు.
యశస్విని రెడ్డి (పాలకుర్తి): కొడకండ్లలో టెక్స్‌టైల్ పార్క్ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ మంజూరు చేయాలి.
పాడి కౌశిక్ రెడ్డి (హుజూరాబాద్): నియోజకవర్గంలోని డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించాలి.
గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి): ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటుంటే అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.
కాటిపల్లి వెంకటరమణ రెడ్డి (కామారెడ్డి): వరంగల్ సీపీ పరిధిలో కానిస్టేబుళ్ల జీవో 118 అమలు కావడం లేదని, సమస్య పరిష్కరించాలని కోరారు.
కేఆర్ నాగరాజు (వర్ధన్నపేట): ఆకేరు వాగులో ఇసుకపై ఆధారపడ్డ 5 వేల కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా పాలసీ తీసుకురావాలని విన్నవించారు.
వెడ్మ బొజ్జు (ఖానాపూర్): ఫారెస్టు అధికారులు ఇందిరమ్మ ఇండ్లను కట్టనివ్వడం లేదని సభ దృష్టికి తెచ్చారు. వీరితో పాటు మరికొంత మంది సభ్యులు సభలో వివిధ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు.
