చితికిపోతున్న చిన్న ఉద్యోగులు

చితికిపోతున్న చిన్న ఉద్యోగులు
  • ఆర్టిజన్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్​ఏలు, మున్సిపల్​ కార్మికుల దాకా వేల మందిది ఇదే పరిస్థితి
  • ఏండ్లుగా హామీలు అమలు చేయని సర్కారు
  • ఇటు పర్మినెంట్​ చేస్తలే.. అటు పే స్కేల్​ ఇస్తలే
  • డిమాండ్ల  సాధన కోసం సమ్మెకు దిగితే ఎస్మా  
  • ఏ చిన్న తప్పు జరిగినా బలిచేస్తున్న ఆఫీసర్లు!

హైదరాబాద్, వెలుగు: చాలీచాలని జీతం.. పని ఒత్తిడి.. పైఅధికారులు ఏ పనిచెప్పినా, ఎంతసేపు చెయ్యాలన్నా అంత సేపు తూచా తప్పక చేయాల్సిందే.. తెలిసో తెలియకో ఏ చిన్నతప్పు జరిగినా సస్పెన్షన్లు.. ఉద్యోగ భద్రత కోసం నిరసనకు దిగితే ఎస్మా ప్రయోగం.. ఇదీ రాష్ట్రంలో శానిటరీ కార్మికుల నుంచి మొదలు వీఆర్​ఏలు, ఆర్టిజన్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ వీవోఏలు, జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల వరకు వేల మంది చిన్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుస్థితి. వారికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు అమలుకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్దేశించిన పనులే కాకుండా.. ఇతర పనులు కూడా చేయించుకుంటున్నప్పటికీ కనీస పే స్కేల్​ను కూడా అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర జీతాలతో కుటుంబాలను సరిగ్గా పోషించుకోలేక.. ఇటు ఉద్యోగాన్ని వదులుకోలేక.. మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయని, పిల్లలను చదివించాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకు సర్కారు ఇచ్చే జీతం సరిపోక అప్పులపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్​అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. తమకు జీతం పెంచాలని, తక్కువ పనిదినాలు కల్పించాలనే డిమాండ్​తో 2020 మార్చిలో ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దిగారు. దీంతో  అందరిన్నీ ప్రభుత్వం  సస్పెండ్​ చేసింది. జీతం దేవుడెరుగు.. ఉన్న చిన్న ఉద్యోగం కూడా పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 7,651 మంది ఫీల్డ్​ అసిస్టెంట్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ  కనిపించిన అధికారులను, మంత్రులను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను దాదాపు రెండేండ్లపాటు ఫీల్డ్​ అసిస్టెంట్లు వేడుకున్నారు. తమకు ఇచ్చే జీతం రూ.10 వేలు మాత్రమేనని, కాస్త పెంచాలని కోరినందుకు ఉన్న ఉద్యోగాలు తీసేస్తారా అని మొరపెట్టుకున్నారు. చివరికి నిరుడు.. ఉన్న శాలరీలతోనే మళ్లీ ఫీల్డ్​ అసిస్టెంట్లను విధుల్లోకి ప్రభుత్వం తీసుకుంది. 

ఆర్టిజన్లపై ఎస్మా ప్రయోగం..!

రాష్ట్రంలోని విద్యుత్‌‌‌‌ సంస్థల్లో  23 వేల మంది ఆర్టిజన్​ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి వచ్చే జీతం అంతంత మాత్రమే. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న తమకు వేతన సవరణలో న్యాయం చేయాలని వాళ్లు డిమాండ్​ చేస్తున్నారు. కానీ,  7 శాతం వేతనాలు సవరించడంతో వీరిలోని నాలుగు కేటగిరీల వారికి రూ. 1,250 నుంచి 3 వేల లోపే వేతనాలు పెరిగాయి. దీంతో ఆర్టిజన్లు.. 51 శాతం ఫిట్​మెంట్​అమలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగుతామని చెప్పడంతో.. ఎస్మా ప్రయోగిస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పలువురిని తొలగించారు.   

ఐకేపీ వీవోఏలకు వచ్చేది రూ. 3,900లే

రాష్ట్రవ్యాప్తంగా 17,608 మంది ఐకేపీ వీవోఏలు (విలేజ్​ ఆర్గనైజింగ్‌‌ అసిస్టెంట్‌‌) గత 20 ఏండ్లుగా పనిచేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు, పదోన్నతులతోపాటు, సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కూడా అందడం లేదు. వాటి సాధనకోసం ఐకేపీ వీవోఏలు చాలా కాలంగా పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా.. ప్రభుత్వం నుంచి స్పందన ఉండటం లేదు. సెర్ప్​ నుంచి  రూ.3,900 మాత్రమే గౌరవవేతనం ఇస్తూ చేతులు దులుపేసుకుంటున్నది. తమను సెర్ప్‌‌ ఉద్యోగులుగా గుర్తించి కనీస గౌరవ వేతనం రూ.18 వేలు ఇవ్వడంతోపాటు  ప్రతి ఒక్కరికి రూ.10 లక్షల బీమా చేయించాలని వీవోఏలు డిమాండ్​ చేస్తున్నారు.

వీఆర్​ఏలకు పే స్కేల్​ కలేనా?

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 వేల మంది వీఆర్​ఏలు ఉన్నారు. వారికి పేస్కేల్​ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్​ 2016లో ప్రకటించారు. నిరుడు  వీఆర్​ఏలు 80 రోజుల పాటు సమ్మె చేస్తే.. మంత్రి కేటీఆర్​ పిలిపించుకుని పే స్కేల్​ ఇస్తామని, వీఆర్​ఏ వారసులకూ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, కేసీఆర్​, కేటీఆర్​ ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలు కావడం లేదు. వీఆర్​ఏలు ప్రతి గ్రామానికి సంబంధించి రెవెన్యూ సేవలను అందిస్తున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దయిన తర్వాత వీరిమీద పని ఒత్తిడి మరింత పెరిగింది. ప్రతిచిన్న విషయానికి వీఆర్ఏల సేవలనే ప్రభుత్వం వాడుకుంటున్నది. 

ప్రొబేషనరీ టైమ్​ ముగిసి ఏడాది దాటినా..

2019లో రాష్ట్ర వ్యాప్తంగా 9,355 మందిని జూనియర్‌‌ పంచాయతీ సెక్రటరీలను ప్రభుత్వం నియమించింది. వీరికి మొదటి మూడేండ్లు ప్రొబేషనరీ కాలం గా నిర్ణయించింది. రూ.15 వేల చొప్పున వేతనం చెల్లించింది. మూడేండ్ల ప్రొబేషనరీ కాలం ముగిసిన తర్వాత జేపీఎస్‌‌లు తమను పర్మినెంట్‌‌ చేయాలని ఆందోళనకు దిగారు.  ప్రభుత్వం రూ.15 వేల నుంచి 28,719కు జీతాలు పెంచి.. ప్రొబేషనరీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించింది. ఆ కాలం కూడా ఏప్రిల్‌‌ 11తో ముగిసింది. అయినా ప్రభుత్వం జేపీఎస్‌‌లను పర్మినెంట్‌‌ చేయటం లేదు. దీంతో జూనియర్‌‌ పంచాయతీ సెక్రటరీలు ఆందోళనబాట పట్టారు.

బిశ్వాల్​ కమిటీ సూచనలు అమలు చేస్తలే

బిశ్వాల్​ కమిటీ సూచనల ప్రకారం.. కింది స్థాయి ఉద్యోగికి నెలకు కనీసం రూ. 19 వేల వేతనం ఇవ్వాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్​, కాంట్రాక్ట్​ చిన్నస్థాయి ఉద్యోగులలో చాలామందికి ఆ మేరకు జీతాలు ఇవ్వడం లేదు. కనీస శాలరీలు ఇచ్చినా తమ బతుకులు బాగుపడుతాయని చిన్న ఉద్యోగులు అంటున్నారు. 

సీఎం చెప్పినా.. మున్సిపల్​ కార్మికులను పర్మినెంట్​ చేయలే


జీహెచ్​ఎంసీతో పాటు ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో శానిటైజేషన్–ప్రజారోగ్యం, నాన్​ పబ్లిక్​ హెల్త్​ విభాగాల్లో పనిచేస్తున్న వర్కర్లు అంతా కలిపితే 60 వేల మంది వరకు ఉంటారు. ఒక్కరోజు వాళ్ల పని ఆగిపోతే సిటీ మొత్తం కంపుకొడుతుంది. అలాంటి ఉద్యోగులు తమ వేతనాలు  పెంచాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్​ చేయాలని కోరుతున్నారు. వారి కనీస వేతనం రూ.15,600 ఉంది. మరికొంత మందికి గరిష్టంగా రూ.22,750 జీతం వస్తుంది. గతంలో జీహెచ్ఎంసీ ఆఫీసు కు వచ్చిన సీఎం కేసీఆర్..  ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. అది ఇప్పటికీ అమలు కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ కూడా కార్మికులకు వర్తించపజేయలేదు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో  35 వేల మంది మల్టీ పర్పస్​ వర్కర్స్​ పనిచేస్తున్నారు. వారికి వచ్చే జీతం రూ.8, 500 మాత్రమే. తమ జీతాలు పెంచాలని కోరుతూ కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. సర్వశిక్షాఅభియాన్​ కింద పనిచేస్తున్న 11 వేల మంది పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. 

చాలి చాలని జీతాలు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నం. చాలీ చాలని జీతాలతో వీఆర్​ఏలో అప్పులపాలవుతున్నరు. కొందరు కుటుంబాలు గడవక మానసిక ఆందోళనతో ప్రాణాలు కోల్పోతున్నరు. పే స్కేల్​ అమలు చేయాలి.
 – కావలి సత్యనారాయణ, తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి కన్వీనర్ 


ప్రాణాలు ఫణంగా పెడ్తున్నం

మా (ఆర్టిజన్లు) ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నం. కరెంటు పోతే వచ్చే వరకు పని చేసేది మేమే. మమ్మల్ని రెగ్యులర్​ చేశామని చెప్తున్న ప్రభుత్వం మరి జీతాలు ఎందుకు పెంచుతలే. బేసిక్‌‌ పే రూ. 12,600లే ఇస్తున్నరు. ఏదైనా జరిగి ప్రాణం పోతే మా కుటుంబాల పరిస్థితి ఏంటి? న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నం.  జీతాలు పెంచి, మా కుటుంబాలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు సమ్మె విరమించం. 
- సాయిలు, జనరల్‌‌ సెక్రటరీ, తెలంగాణ విద్యుత్‌‌ ఎంప్లాయీస్‌‌ యూనియన్​