V6 News

కోదండరాం, అజారుద్దీన్‌‌‌‌కు ఎమ్మెల్సీలుగా లైన్‌‌‌‌ క్లియర్‌‌‌‌

కోదండరాం, అజారుద్దీన్‌‌‌‌కు ఎమ్మెల్సీలుగా లైన్‌‌‌‌ క్లియర్‌‌‌‌
  • కోదండరాం, అజారుద్దీన్‌‌‌‌కు ఎమ్మెల్సీలుగా లైన్‌‌‌‌ క్లియర్‌‌‌‌
  • ఆమోదం తెలిపిన గవర్నర్‌‌‌‌ శివ ప్రతాప్‌‌‌‌ శుక్లా
  • సుమారు 8 నెలలుగా లోక్​భవన్‌‌‌‌లో ఫైల్ పెండింగ్​
  • అజారుద్దీన్‌‌‌‌ మంత్రి పదవికి ఇంకా ఐదు రోజుల డెడ్‌‌‌‌లైన్‌‌‌‌
  • ఈలోగా గవర్నర్‌‌‌‌ నిర్ణయంతో పదవి సేఫ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌‌‌‌ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్‌‌‌‌ ఎంపిక ఎట్టకేలకు పూర్తయింది. సుమారు ఎనిమిది నెలలుగా లోక్‌‌‌‌భవన్‌‌‌‌లో పెండింగ్‌‌‌‌లో ఉన్న ఫైల్‌‌‌‌కు గవర్నర్‌‌‌‌ శివప్రతాప్‌‌‌‌ శుక్లా శనివారం ఆమోదం తెలిపారు. చట్టసభలకు ప్రాతినిధ్యం లేకుండానే అజారుద్దీన్‌‌‌‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఈ నెల 30వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి కానుంది. ఈ లోగా అజారుద్దీన్‌‌‌‌ ఎమ్మెల్సీ పదవిపై గవర్నర్‌‌‌‌ నిర్ణయం తీసుకోకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. డెడ్‌‌‌‌లైన్‌‌‌‌కు మరో ఐదు రోజుల ముందే గవర్నర్‌‌‌‌ ఆమోద ముద్ర వేయడంతో ఇటు ప్రభుత్వం, అటు కాంగ్రెస్‌‌‌‌ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

మరో వైపు టీజేఎస్‌‌‌‌ అధ్యక్షుడు కోదండరాం సైతం మళ్లీ శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. గతంలో చేపట్టిన పదవిని మధ్యలోనే వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గవర్నర్ నిర్ణయంతో కోదండరాం మరోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

ఎనిమిది నెలలుగా పెండింగ్‌‌‌‌లోనే..

బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా అప్పటి గవర్నర్‌‌‌‌ తమిళసై తిరస్కరించారు. గవర్నర్ నిర్ణయంపై వీరిద్దరూ వేర్వేరుగా హైకోర్టులో సవాల్ చేశారు. ఈలోగా కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం గవర్నర్‌‌‌‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌ పేర్లను సిఫార్సు చేయడంతో గవర్నర్ ఆమోదించారు. దీంతో 2024 ఆగస్టు 4న దాసోజు, సత్యనారాయణ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం గతేడాది ఆగస్టు 13న కోదండరాం, అమేర్ అలీఖాన్‌‌‌‌ నియామకాన్ని కోర్టు రద్దు చేసింది. అదే సమయంలో కొత్త పేర్లను గవర్నర్​కు సిఫార్సు చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోదండరాం, అజారుద్దీన్‌‌‌‌ పేర్లను 8 నెలల కింద గవర్నర్‌‌‌‌కు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలోనే పెండింగ్ ఫైల్‌‌‌‌పై శనివారం గవర్నర్ సంతకం చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.

పీసీసీ చీఫ్‌‌‌‌, మంత్రి హర్షం

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ నియామకానికి సంబంధించిన ఫైల్‌‌‌‌పై గవర్నర్‌‌‌‌ సంతకం చేయడం పట్ల పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌  వేర్వేరుగా హర్షం వ్యక్తం చేశారు. సమాజ సేవకులైన వీరిద్దరికీ శాసనమండలిలో స్థానం కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఇద్దరిలో ఒకరు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడారని, మరొకరు క్రీడారంగంలో ప్రపంచంలోనే భారత్‌‌‌‌కు గొప్ప పేరు తీసుకువచ్చారని కొనియాడారు.