గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు..ఒకే రోజు 9,990 పెండింగ్ ​బిల్లులు క్లియర్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం !

గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు..ఒకే రోజు 9,990 పెండింగ్ ​బిల్లులు క్లియర్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం !
  • ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్ పనులకు రూ.85 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్​లో ఉన్న దాదాపు పది వేల బిల్లులను ఒకే రోజున క్లియర్ చేసి, ఏకంగా రూ.153 కోట్లు విడుదల చేసింది. గ్రామ పంచాయతీలకు వివిధ పనుల నిమిత్తం గత కొన్నేండ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి.  చాలా పంచాయతీలు నిధుల లేమితో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత బకాయిలన్నింటిని రిలీజ్​చేసింది. 2024 ఆగస్టు వరకు పెండింగ్​లో ఉన్న రూ.10 లక్షల లోపు బిల్లులకు ప్రాధాన్యతనిచ్చి వాటన్నింటిని ఒకే విడతలో చెల్లించింది. దీంతో ఒకే రోజున ఏకంగా 9,990 బిల్లులను క్లియర్ అయ్యాయి.

కేవలం పెండింగ్ బిల్లులు మాత్రమే కాకుండా, ఎస్​డీఎఫ్​(ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.85 కోట్లు విడుదల చేసింది. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థలు, సామాజిక సౌకర్యాల కల్పన వంటి పనులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.గత ప్రభుత్వం  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్ నిధులను సైతం సకాలంలో విడుదల చేయకపోవడంతో అనేక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.  దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడటమే కాకుండా, సకాలంలో బిల్లులు అందక కాంట్రాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు నాటి సర్పంచ్​లు అప్పుల పాలయ్యారు.

పంచాయతీ ఎన్నికలకు రెడీ ? 

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెండింగ్​నిధులు రిలీజ్ చేయడం, స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు రెడీ అవ్వాలని ఇటీవల ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్​ రెడ్డి  సూచించడం వంటి పరిణామాలతో సర్పంచ్ ఎన్నికలకు గ్రీన్​ సిగ్నల్​ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడే తేలే అంశం కాకపోవడంతో పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి.. స్థానిక పోరులోకి దిగేందుకు అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. జూన్ నెలలోనే సర్పంచ్​ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.