
- ఏఐసీసీ ఒత్తిడి కారణంగానే కేంద్రం దిగొచ్చింది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- విధానపర నిర్ణయాల్లో సర్వే అంశాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడి
ఖమ్మం టౌన్, వెలుగు: దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని కేంద్రం ప్రకటించడం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజల విజయం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ ఆఫీస్‌లో డిప్యూటీ సీఎంను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులగణన చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఢిల్లీకి పంపడంతోనే కేంద్రంపై ఒత్తిడి పెరిగిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణలో మాత్రమే కులగణన విజయవంతంగా పూర్తి చేసి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో కులగణన సర్వేను 55 రోజుల్లోనే పూర్తి చేశామన్నారు.
ఈ సర్వేలో కులాల గురించి మాత్రమే కాకుండా ప్రజల ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ అవకాశాలు, సహజ వనరులకు సంబంధించిన అంశాలను సేకరించినట్లు చెప్పారు. తాను మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలోఎలాంటి పొరపాట్లు లేకుండా పగడ్బందీగా కులగణన సర్వే జరిగిందన్నారు. రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉన్నారని లెక్కలు తేల్చడంతోపాటు 42 శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేశామన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధాన మంత్రికి లేఖ రాసి కేంద్రంపై ఒత్తిడి చేశామన్నారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో గుజరాత్ లో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్‌లోనూ కులగణనపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. పార్లమెంట్ లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కులగణనపై మాట్లాడారని చెప్పారు. ఎస్జీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులగణను విజయవంతంగా నిర్వహించడంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీలకంగా వ్యవహరించారన్నారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు, గౌడ, యాదవ, నాయిబ్రాహ్మణ, రజక, పద్మశాలి, విశ్వకర్మ, శాలివాహన, కాపు కులాల నాయకులు పాల్గొన్నారు.