ఆలయాలకు కొత్త కళ.. పదేళ్లలో ఒక్క యాదాద్రి.. నేడు 20 టెంపుల్స్ అభివృద్ధి

ఆలయాలకు కొత్త కళ.. పదేళ్లలో ఒక్క యాదాద్రి.. నేడు 20 టెంపుల్స్ అభివృద్ధి
  • రూ.2,216 కోట్లతో ప్రధాన ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు
  • ఇప్పటికే వేములవాడ, బాసర, 
  • భద్రాద్రి, కాళేశ్వరంలో పనులు షురూ
  • ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు పనులకు టెండర్లు
  • రూ.101 కోట్లతో మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలు, పునర్నిర్మాణ పనులు పూర్తి
  • మరో 9 ఆలయాలకు మాస్టర్​ప్లాన్ రెడీ


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు మహర్దశ పడుతున్నది. తెలంగాణ వచ్చాక పదేండ్లలో ఒక్క యాదాద్రి ఆలయం నిర్మాణం చేపడ్తే, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన కేవలం రెండున్నరేళ్లలో రూ.2,216 కోట్లతో 20 ప్రధాన ఆలయాల​ పునర్ నిర్మాణ పనులను భుజానికెత్తుకున్నది. 11 ప్రధాన ఆలయాల్లో చేపడ్తున్న విస్తరణ పనులు వివిధ దశల్లో ఉండగా, మరో 9 ముఖ్యమైన టెంపుల్స్ అభివృద్ధికి మాస్టర్ ​ప్లాన్స్ సిద్ధమయ్యాయి. వేములవాడ, బాసర, భద్రాద్రి, కాళేశ్వరం దేవస్థానాల్లో ఇప్పటికే పనులు జోరుగా సాగుతున్నాయి. కొండగట్టు, ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసర, చెరువుగట్టు పనులకు టెండర్లు చివరిదశకు చేరుతున్నాయి. మేడారంలోనూ రూ.101 కోట్లతో సమ్మక్క-సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, అభివృద్ధి పనులను కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిచేసిన సంగతి తెలిసిందే. వేములవాడ సహా దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఆలయాల్లో విస్తరణ పనులు జోరుగా సాగుతుండడంపై భక్తుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

ఆధ్యాత్మిక వైభవం దిశగా.. 

రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రభుత్వం నడుం బిగించింది. ప్రముఖ దేవాలయాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పునరుద్ధరణ పనులను శరవేగంగా చేపడుతున్నది. గత ప్రభుత్వం కేవలం యాదాద్రి పునర్నిర్మాణానికే పరిమితమై, మిగిలిన ఆలయాలను నిర్లక్ష్యం చేసింది. కానీ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాన ఆలయాల పునర్నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. 


ఇందులో భాగంగా తొలి విడత రాష్ట్రంలోని 11 ప్రముఖ పుణ్యక్షేత్రాలను రూ.1,300 కోట్లతో అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతోంది. దక్షిణ కాశీగా పిలిచే వేములవాడ రాజన్న ఆలయానికి రూ.181.25 కోట్లు కేటాయించగా ఆలయ పునర్నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇరుకుగా ఉన్న ఆలయ ప్రాంగణాన్ని , రోడ్లను, క్యూలైన్లను, కోనేటిని విస్తరిస్తున్నారు. అన్నదాత సత్రం ఏర్పాటుచేస్తున్నారు. ప్రధాన ఆలయానికే పరిమితం కాకుండా ఇక్కడ రూ.20 కోట్లతో అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ గుడిని పునర్నిర్మిస్తున్నారు. వేలమంది భక్తులు ఒకేసారి బోనాలు సమర్పించేందుకు అనుగుణంగా మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. మరో రూ.100 కోట్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టు కల్లా పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దక్షిణ అయోధ్యగా పిలిచే భద్రాచలంలో ఆలయ ప్రాకారాల అభివృద్ధి, పర్ణశాల, మల్టీ లెవల్ పార్కింగ్ పనులు చేపడ్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.586 కోట్లు కేటాయించగా, తొలి విడత రూ.276.00 కోట్ల మంజూరయ్యాయి. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, కీసర రామలింగేశ్వర స్వామి, చెరువుగట్టు ఆలయాలకు రూ.100 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి రూ.50 కోట్లు, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి రూ.30 కోట్లు కేటాయించగా పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

బాసరలోని జ్ఞాన సరస్వతి క్షేత్రంలో ప్రభుత్వం రూ.225 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేపడుతున్నది. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి భూమిపూజ చేశారు. ప్రస్తుతం 2వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని 5 వేల చదరపు అడుగులకు పెంచనున్నారు. ఉత్తరం వైపున తొమ్మిది అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కులా మాఢ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. గోదావరి పుష్కరాలు నాటికి పనులు పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు.

 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయాన్ని రూ.198 కోట్లతో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పునర్నిర్మాణ పనులకు ఇప్పటికే  భూమి పూజ పూర్తిచేశారు. గోదావరి పుష్కరాల నాటికి సుమారు 25వేల మంది భక్తులకు వసతి, సౌకర్యాలు కల్పించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆలయ ప్రాంగణంలో గోపురాలు, ప్రాకారాలు, భక్తుల కోసం స్నాన ఘట్టాలు, రహదారులు నిర్మించనున్నారు. దీనితో పాటు ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

 మహబూబ్​నగర్ జిల్లా అమరచింత పరిధిలోని కురుమూర్తి క్షేత్రం అభివృద్ధికి సైతం ప్రభుత్వం  రూ.110 కోట్లు మంజూరు చేసింది. కొండపైకి భక్తులు సులువుగా చేరుకునేలా ఎలివేటెడ్ ఘాట్ రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మిస్తున్నారు. ఆలయ ఆవరణలో మహా మండపం, క్యూ కాంప్లెక్స్, విశ్రాంతి గృహాలు, కాటేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.

మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, విస్తరణ, శాశ్వత రాతి నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.101 కోట్లను కేటాయించింది. గద్దెల ప్రాంతాన్ని పూర్తిగా రాతి కట్టడంగా తీర్చిదిద్దారు. ప్రధాన గద్దెను 46 గ్రానైట్ స్తంభాలతో ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించారు.  మేడారం కథ, గిరిజన యోధుల వీరగాథలను తెలిపేలా ప్రధాన ద్వారంపై 59 ప్రత్యేక విగ్రహాలను చెక్కించారు. జంపన్న వాగు సుందరీకరణ, నాలుగు లైన్ల రోడ్ల విస్తరణ, క్యూ లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

‘ఎస్​డీఎఫ్’​తో మారనున్న 
ఆలయాల రూపురేఖలు..

ప్రముఖ పుణ్యక్షేత్రాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను (ఎస్​డీఎఫ్) వెచ్చిస్తోంది. ఆలయాల పునర్నిర్మాణంతోపాటు  మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటోంది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించి కీలకమైన భూసేకరణ ప్రక్రియ కోసం అత్యధికంగా రూ. 60.20 కోట్లను కేటాయించింది. కొడంగల్​లోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం భూసేకరణ కోసం రూ.30 కోట్లు, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనుల కోసం మరో రూ.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కొడవటంచలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.12.15 కోట్లు, కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ మారుతీ మందిరంలో ప్రాకార మండప నిర్మాణానికి రూ.6.70 కోట్లు కేటాయించింది.

ఖమ్మం జిల్లాలో యాడవల్లి ఆలయ పునర్నిర్మాణానికి రూ.4.745 కోట్లు, కుసుమంచి గణపేశ్వరాలయానికి రూ.3.35 కోట్లు, వైరా లక్ష్మీపురంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కల్యాణ వేదిక, డార్మిటరీల నిర్మాణం కోసం రూ.3.20 కోట్లు మంజూరుచేసింది. ముదిగొండ గంధసిరి శివాలయం, నారాయణపేట కోస్గిలోని వేణుగోపాల స్వామి దేవస్థానాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇచ్చింది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.1.75 కోట్లు, ములుగు భక్తఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 1.29 కోట్లు మంజూరయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట, కేసముద్రం అర్పనపల్లి ఆలయాలకు రూ.కోటి చొప్పున, ఖమ్మం జిల్లా పామిలోని రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ. 83 లక్షలతో పనులను వేగవంతం చేసింది.

యాదాద్రిలోనూ ‘చతుర్వేద’ పాఠశాల

యాదాద్రిలో ఆధ్యాత్మికతతో పాటు వేద విద్యను ప్రోత్సహించేందుకు కంచి కామకోటి పీఠం మార్గదర్శకత్వంలో 17 ఎకరాల్లో రూ. 43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం కల్పించనున్నారు. ఒకేచోట నాలుగు వేదాల (రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం) అధ్యయన పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు.

పుష్కరాలకు రూ.1,000 కోట్లు

2027-28లో జరిగే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పుడే కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం రూ. 1,000 కోట్ల నిధులు కేటాయించింది. నిధులు ఇవ్వడమే కాకుండా, ఆలయాల పాలనలోనూ మార్పులు తెచ్చింది. ఇందులో భాగంగా 443 ఆలయాలకు కొత్తగా ధర్మకర్తల మండళ్లను (ట్రస్ట్​ బోర్డులు) ఏర్పాటు చేసింది. ధర్మకర్తల పదవీ కాలాన్ని ఏడాది నుంచి రెండేళ్లకు పెంచడం విశేషం.

తొమ్మిది ఆలయాలకు మాస్టర్​ప్లాన్​ రెడీ.. 

రాష్ట్రంలోని మరికొన్ని ఆలయాలకు  మాస్టర్ ప్లాన్ రూపొందించారు. హైదరాబాద్​లోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం, సిద్ధిపేటలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి, హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జునస్వామి, మడికొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి, ఖమ్మం జిల్లాలోని జమలాపురం వెంకటేశ్వర స్వామి, హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవస్థానం, సికింద్రాబాద్​ తాడ్ బండ్ వీరాంజనేయ స్వామి, మెదక్​ ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయాల అభివృద్ధి చేయనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి గడువులోగా పనులు పూర్తిచేసేలా పర్యవేక్షించనున్నారు.