రుణం మాఫీ కాలే.. పరిహారం రాలె

రుణం మాఫీ కాలే..  పరిహారం రాలె

ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆనవాయితీకి భిన్నంగా ప్రభుత్వం ఆడంబరంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ప్రకటనల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టి, రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా జూన్ 3 న రాష్ట్ర వ్యాప్తంగా “రైతు దినోత్సవం” నిర్వహించింది. 2011 నుంచి రాష్ట్రంలో గ్రామీణ, వ్యవసాయరంగ సమస్యలపై, రైతుల, కూలీల సమస్యలపై నిరంతర అధ్యయనంతో, గ్రామీణ ప్రజల పక్షాన స్వతంత్ర వేదికగా పని చేస్తున్న రైతు స్వరాజ్య వేదిక 2014, 2018 అధికార పార్టీ ఎన్నికల ప్రణాళికలను విశ్లేషించే ప్రయత్నం చేసింది. 

ఎన్నికల ప్రణాళికలలో..

2014, 2018 సంవత్సరాల్లో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం బీఆర్​ఎస్​గా మారిన టీఆర్ఎస్​ రెండు సార్లూ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపంలో ప్రజలకు ముఖ్యంగా రైతులకు అనేక రాత పూర్వక హామీలు ఇచ్చింది. ఎన్నికల బహిరంగ సభల్లో, ఇతర ప్రచార కార్యక్రమాల్లో ఇంకా అనేక వాగ్దానాలు చేసింది. సభల్లో ఇచ్చిన హామీల మాటెలా ఉన్నా, రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయి? ప్రభుత్వం ఈ హామీల అమలు కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉన్న సమస్యలు ఏమిటి? ఈ హామీల అమలుకు ఆర్థికంగా తగినన్ని నిధులను బడ్జెట్ లో కేటాయించిందా? నిధుల విడుదల జరిగిందా?

 కేటాయించిన నిధులన్నీ ఖర్చయ్యాయా? అమలు చేసిన పథకాల వల్ల చేసిన ఖర్చులకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయా? ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? ప్రజల జీవితాలు బాగయ్యాయా? ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరాయా? ప్రభుత్వం చెబుతున్నట్లుగా బంగారు తెలంగాణ వైపు అడుగులు పడుతున్నాయా? ఈ అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరముంది. ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయ రంగానికి నాటి టీఆర్ఎస్ ​అనేక హామీలు ఇచ్చింది. గ్రామీణ ప్రజలపై, రైతులపై ఎక్కువ ప్రభావం చూపించే అంశాల ఆధారంగా ప్రధానమైన హామీల అమలు ఎలా ఉన్నదో చూద్దాం. 

లక్ష రూపాయల రుణమాఫీ

2014 రుణ మాఫీ: 2014 లో రైతులకు రుణమాఫీ గురించి హామీ ఇచ్చినా సకాలంలో, ఒకే దశలో చేయకపోవడం వల్ల రైతులపై వడ్డీ భారం పడింది. అనేక  విడతలుగా అమలు చేయడం, రుణ మాఫీ నిధులు పంట సీజన్ ప్రారంభంలోపు బ్యాంకులకు విడుదల చేయక పోవడంతో 2014 నుంచి 2018 వరకు పంట రుణాలు రైతులకు సరిగా లభించలేదు. రైతులు మళ్లీ ప్రైవేట్ రుణాలపై ఆధారపడాల్సి వచ్చింది. వ్యవసాయ కుటుంబాలను రుణ విముక్తులను చేసే లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసిన రుణ విమోచన కమిషన్ వ్యవస్థకు సరైన అధికారాలు, పని తీరు ప్రభుత్వం కల్పించలేదు. 

2018 ఎన్నికల సందర్భంగా రైతులకు మళ్లీ రుణ మాఫీ హామీ ప్రకటించడం 2014 నాటి రైతు రుణ మాఫీ తన లక్ష్యాన్ని సాధించలేదనడానికి  నిదర్శనం. ఎస్ఎల్ బీసీ 37వ సమావేశాల మినిట్స్ ప్రకారం పంట రుణాలపై 2014 నుంచి 2018 వరకు బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రాయితీ బకాయిలు రూ. 725.18 కోట్లు అలాగే ఉన్నాయి. బ్యాంకులు మాత్రం ఈ వడ్డీలను రైతుల నుంచి వసూలు చేశాయి. ప్రభుత్వం ఎప్పుడు వేస్తుందో, ఆ డబ్బులు రైతులకు తిరిగి ఎప్పుడు వెళ్తాయో తెలియదు.


2018 రుణమాఫీ: 2018 రైతు రుణ మాఫీ కోసం ప్రభుత్వం ఏటా బడ్జెట్​లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ, వాటిని విడుదల చేయడం లేదు. ఎస్​ఎల్​బీసీ తాజా మినిట్స్​ ప్రకారం.. రాష్ట్రంలో ​42, 22, 928 మంది రైతులకు రూ. 27,487.36 కోట్ల రుణ మాఫీ చేయాల్సి ఉండగా, 5, 42, 679 మంది రైతులకు కేవలం 1207.37 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. 
చేయాల్సిన మొత్తంలో ఇది కేవలం 4.4 శాతం మాత్రమే. వాటిపై వడ్డీ రాయితీ మొత్తాలను కూడా ఇప్పటి వరకు చెల్లించడం లేదు. ఇంకా 36,80,249 మంది రైతులకు ( 87 శాతం మందికి ) 26,279.99 కోట్లు రుణ మాఫీ చేయాల్సి ఉంది. 

ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టం, పంటల బీమా

ప్రకృతి వైపరీత్యాలకు తెలంగాణ సర్కారు సరిగా స్పందించిన దాఖలాలు లేవు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో కరువు పీడించింది. తెలంగాణ రైతు జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా కరువు యాత్ర చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం 2014–-15 ఏడాదిలో కరువు ఉన్నట్లు గుర్తించలేదు. 2015–-16 లో కరువును గుర్తించినా, కేంద్రం నుంచి వచ్చిన రూ.710 కోట్ల సాయాన్ని అధిక భాగం రైతులకు అందించలేదు. 2020 ఖరీఫ్ లో భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ప్రభుత్వం మొదటిసారి తనంతట తాను ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి పంపి, నష్ట పరిహారం ఇవ్వడానికి కేంద్రం సాయం చేయాలని కోరింది. కేంద్ర బృందం కూడా రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లింది. 

రూ.188 కోట్ల పరిహారం మంజూరు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రైతులకు పంచలేదు. రైతు స్వరాజ్య వేదిక ఈ విషయంలో హై కోర్టుకు వెళ్లగా.. రైతులకు పరిహారం చెల్లించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయకుండా తప్పించుకునేందుకు సుప్రీంకు వెళ్లింది. 2021, 2022 సంవత్సరాల్లో కూడా భారీ వర్షాలకు రైతులు పంటలు నష్ట పోయారు. కానీ  ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు సాయం చేయలేదు. 2023 మార్చి17, -20 తేదీల మధ్య భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం చెల్లిస్తామని సీఎం స్వయంగా పంటలు పరిశీలించి ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు. 

దేశంలో, రాష్ట్రంలో దశాబ్దాలుగా పంటల బీమా పథకాలు అమలవుతున్నా, రాష్ట్రంలో పంటల బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువ. 2016 ఖరీఫ్ నుంచి అమల్లోకి వచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలు రాష్ట్రంలో 2019 రబీ వరకు అమలైనా, ఎక్కువ మంది రైతులకు చేరలేదు. ఈ పంటల బీమా పథకాలు బాగా లేవని విమర్శించిన బీఆర్ఎస్​ సర్కారు.. ప్రతి రైతుకు వర్తించే సరైన పంటల బీమా పథకాన్ని తీసుకు వచ్చి అమలు చేయకపోగా, 2020 ఖరీఫ్ నుంచి పూర్తిగా పంటల బీమా పథకాలను అమలు చేయడం మానేసింది. మొత్తం భారత దేశంలో పంటల బీమా పథకం అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. 

బ్యాంకుల నుంచి రుణాలు ఏవి?

ఒక లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణంగా, మూడు లక్షల వరకు 3 శాతం వడ్డీపై(పావలా వడ్డీ) పంట రుణం అందిస్తామని హామీ ఇచ్చినా, కానీ 2014, 2018 లో తెరాస ఇచ్చిన రుణమాఫీ హామీలు సకాలంలో అమలు కాకపోవడం వల్ల రైతుల బ్యాంకు రుణాలు అలాగే ఉండిపోయాయి. బ్యాంకులు రైతులకు  ఇచ్చే పంట రుణాలు బాగా తగ్గిపోయాయి. 2018 లో 40.88 శాతం మందికి పంట రుణాలు ఇస్తే, 2021 ఖరీఫ్ లో కేవలం 25.44 శాతం మందికి మాత్రమే పంట రుణాలు అందాయి. 2022లో రూ. 67,864.4 కోట్ల పంట రుణాల లక్ష్యంలో రూ. 23,793.15 కోట్లు (35.06 శాతమే) మాత్రమే ఇచ్చారు. 

రైతుల్లో 35.6 శాతం మంది కౌలు రైతులు ఉన్నా, ప్రభుత్వం వారిని రైతులుగా గుర్తించక పోవడం వల్ల బ్యాంకులు వారికి పంట రుణాలు ఇవ్వడం లేదు. దాంతో కౌలు రైతులు ప్రైవేట్ అప్పుల ఊబిలో పడి పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు (రుణ అర్హత కార్డులు) ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఆ చట్టాన్ని ప్రభుత్వం ఏ మాత్రం అమలు చేయట్లేదు. 

కన్నెగంటి రవి, విస్సా కిరణ్​కుమార్, రైతు స్వరాజ్య వేదిక