రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల భద్రతకు డిస్‌‌ప్లే బోర్డులు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో  పిల్లల భద్రతకు డిస్‌‌ప్లే బోర్డులు
  •     రూ. 500తో స్కూల్ గోడలపై ఎమర్జెన్సీ నంబర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భద్రతను పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి స్కూల్ లోని విద్యార్థులకు అవసరమైన భద్రతా మార్గదర్శకాలు, అత్యవసర ఫోన్ నంబర్లతో కూడిన డిస్‌‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 1.05 కోట్ల నిధులను మంజూరు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21,010 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్కూలుకు రూ. 500 చొప్పున నిధులను కేటాయించారు. జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో) ఈ నిధులను ఆయా పాఠశాలల మేనేజ్మెంట్ కమిటీలకు (ఎస్ఎంసీ) అందజేయనున్నారు. 

రూ. 500తో  పాఠశాల ఆవరణలో అందరికీ స్పష్టంగా కనిపించే విధంగా గోడలపై లేదా బోర్డులపై భద్రతా సూచనలను పెయింటింగ్ వేయించాలని అధికారులు సూచించారు. వీటిని తెలుగు, ఇంగ్లీష్‌‌తో పాటు ఉర్దూ భాషల్లో కూడా సిద్ధం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులకు అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అంతేగాక, ప్రతిరోజూ ఉదయం స్కూల్ ప్రార్థనా సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్ చేయాలని పేర్కొన్నారు.