
- జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఏర్పాటు
- అన్ని వసతులతో వెంచర్ల డెవలప్మెంట్
- ప్రభుత్వ, అసైన్డ్ భూములకు ప్రాధాన్యం
- యజమానుల అంగీకారంతో పట్టా భూముల్లో సైతం..
- భూములను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు
మంచిర్యాల, వెలుగు: ల్యాండ్ పూలింగ్ ద్వారా మున్సిపాలిటీల్లోని గవర్నమెంట్, అసైన్డ్ ల్యాండ్స్‌లో లేఅవుట్లు చేసి భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఖాళీ అయిన రాష్ర్ట ఖజనాను నింపుకోవడానికి సర్కారు కొత్త దారులు వెతుకుతోంది. ఇప్పటికే పలుచోట్ల రూ. కోట్ల విలువైన భూములను అమ్మిన ప్రభుత్వం తాజాగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. ప్రభుత్వ, అసైన్డ్ భూములు దొరకని చోట పట్టా భూములను సేకరించనుంది. బడా రియల్ఎస్టేట్ సంస్థలకు దీటుగా ఆయా మున్సిపాలిటీల్లో లేఅవుట్లను డెవలప్ చేసి ప్లాట్లు విక్రయించనుంది. ఇప్పటికే ఆర్డర్స్ జారీ కావడంతో రెవెన్యూ, మున్సిపల్అధికారులు భూములను గుర్తించే పనిలో పడ్డారు. ఆయా మున్సిపాలిటీల్లోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల రికార్డులకు సంబంధించిన ఫైళ్ల దుమ్ము దులుపుతున్నారు.
20 ఎకరాల్లో లేఅవుట్లు
మున్సిపాలిటీల్లో 20 ఎకరాలకు ఒక లేఅవుట్వెంచర్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత మొత్తంలో గవర్నమెంట్, అసైన్డ్భూములు లేకుంటే వాటి పక్కనున్న పట్టా భూములను యజమానుల అంగీకారంతో సేకరించనున్నారు. ఎకరం నుంచి నాలుగైదు ఎకరాల బిట్లను కలిపి మొత్తం 20 ఎకరాల్లో, అదీ వీలు కాకుంటే కనీసం10 ఎకరాల్లో లేఅవుట్చేయనున్నారు. డీటీసీపీ రూల్స్ప్రకారం 33 ఫీట్ల బ్లాక్‌టాప్ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ లైన్లు, వాటర్సప్లై, అవెన్యూ ప్లాంటేషన్ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. సామాజిక అవసరాల కోసం మొత్తం భూమిలో 10 శాతం కేటాయించి అందులో పార్కులు, ఆలయాలు, స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. లేఅవుట్ డెవలప్మెంట్చేసిన తర్వాత 50 శాతం ప్లాట్లను యజమానులకు అప్పగించి, మిగతా 50 శాతం ప్లాట్లను గవర్నమెంట్అమ్ముకుంటుంది. భూముల స్వభావాన్ని బట్టి లేఅవుట్ డెవలప్మెంట్కు ఎక్కువ మొత్తంలో ఖర్చయినట్లయితే ప్రభుత్వం 60 శాతం తీసుకుని 40 శాతం భూ యజమానులకు అప్పగిస్తుంది.
అసైన్డ్‌దారులకు, కొనుగోలుదారులకు మేలు..
మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్, నస్పూర్, క్యాతన్‌పల్లి, లక్సెట్టిపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. మంచిర్యాల, నస్పూర్‌లో చాలాకాలంగా రియల్ఎస్టేట్ బిజినెస్ జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో మిగతా ఐదు టౌన్లలోనూ రియల్ బిజినెస్ పుంజుకుంది. పట్టణ శివారు ప్రాంతాల్లో రోజుకో వెంచర్ వెలుస్తోంది. ఎక్కడ చూసినా గజానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా రేటు పలుకుతోంది. అసైన్డ్భూములను అమ్ముకోవడానికి చాన్స్ లేకపోవడంతో యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇల్లీగల్‌గా కొనుగోలు చేసి రియల్వెంచర్లు చేస్తున్నారు. ప్రభుత్వమే అధికారికంగా లేఅవుట్లు చేస్తుండడంతో అసైన్డ్‌దారులకు తిప్పలు తప్పనున్నాయి. డబుల్ రిజిస్ర్టేషన్ల వంటి రియల్టర్ల మోసాలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.
అన్ని వసతులతో లేఅవుట్ల అభివృద్ధి
జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, అసైన్డ్‌భూముల్లో లేఅవుట్లు చేయాలని ఆదేశాలు వచ్చాయి. భూముల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. యజమానులు ముందుకొస్తే పట్టా భూములను సైతం తీసుకుంటాం. సర్కారీ లేఅవుట్లలో డీటీసీపీ రూల్స్ప్రకారం అన్ని వసతులను కల్పిస్తాం. అసైన్డ్, పట్టా భూములను లేఅవుట్ల కోసం ఇవ్వదలిచిన వారు సంబంధిత తహసీల్దార్లను సంప్రదించాలి.
బి.రాహుల్, అడిషనల్ కలెక్టర్
(లోకల్‌బాడీస్)