
హైదరాబాద్, వెలుగు: ఆషాఢ మాసంలో జరగనున్న బోనాలకు రూ.20 కోట్లకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. బుధవారం ఎండో మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జీవో విడుదల చేశారు. హైదరాబాద్ కలెక్టర్ తదుపరి చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బోనాలకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికి రెండు సార్లు రివ్యూలు చేపట్టారు. గోల్కొండ, లాల్ దర్వాజతో పాటు సిటీలోని అన్ని ప్రాంతాల్లో బోనాలు ఘటనంగా నిర్వహించాలని పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.