విద్యాకమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి?!

విద్యాకమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి?!
  • వ్యవసాయ కమిషన్ కు కోదండరెడ్డి?
  •  రెండు కమిషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు
  •  త్వరలోనే ఉత్తర్వుల  జారీకి చాన్స్
  •  జగన్ సర్కారులో మన ఊరు–మనబడితో సక్సెస్ అయిన మురళి
  •  రోల్ మోడల్ గా మౌలిక సదుపాయాల కల్పన
  •  రాష్ట్రంలోని సర్కారు బడులకు ప్రాధాన్యం పెంచనున్న సర్కారు
  •  సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పలు స్కూళ్లు
  •  విద్యారంగంలో సమూల మార్పుల దిశగా అడుగులు

హైదరాబాద్: తెలంగాణ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం విద్యాకమిషన్ ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ సర్కార్ హయాంలో ఏపీ ప్రభుత్వంలో సలహాదారుగా  పనిచేసిన ఆకునూరి మురళిని కమిషన్ చైర్మన్ గా నియమించనున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతోపాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మురళి విశేషంగా కృషి చేశారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలలకు కొత్తరూపు వచ్చింది. 

గత ప్రభుత్వం సర్కారు బడులను విస్మరించి.. రెసిడెన్షియల్ పాఠశాలల మీద దృష్టి పెట్టింది. దీంతో చాలా పాఠశాలల మూతపడ్డాయి. కొన్నింటిని రేషనలైజేషన్ ద్వారా  పక్క గ్రామంలోని పాఠశాల్లలో కలిపేశారు. ఆ  పాఠశాలలకు పూర్వ వైభవం తేవడంతోపాటు బడిని చదువులమ్మ గుడిగా విజ్ఞాన భాండాగారంగా తీర్చిదిద్దాలని రేవంత్ సర్కారు బావిస్తోంది. ఇందుకోసం అపారమైన అనుభవం ఉన్న ఆకునూరి మురళిని విద్యాకమిషన్ చైర్మన్ గా నియమించనుందని సమాచారం. భూపాలపల్లి కలెక్టర్ గా విధులు నిర్వర్తించిన మురళి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు పడి.. స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 

అనంతరం ఏపీ ప్రభుత్వం మురళి సేవలను వినియోగించుకుంది. ఆయనను సలహాదారుగా నియమించుకున్న అప్పటి సీఎం వైఎస్ జగన్ విద్యారంగం బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా మన ఊరు–మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించి సక్సెస్ అయ్యారు. అదే కార్యక్రమాన్ని తెలంగాణలోని బీఆర్ఎస్  సర్కారు ఇంప్లిమెంట్ చేసింది. విద్యా కమిషన్ ను ఆకునూరి మురళికి అప్పగిస్తే సత్ఫలితాలు వస్తాయని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆకునూరి మురళి బీఆర్ఎస్ ఒంటెత్తుపోకడలకు వ్యతిరేకంగా పనిచేశార. ప్రస్తుతం సోషల్ డెమోక్రాటిక్ ఫోరం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

కోదండరెడ్డికి వ్యవసాయ కమిషన్

కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డికి వ్యవసాయ కమిషన్ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న కోదండరెడ్డి రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తారు. ముషీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన చాలా కాలం నుంచి కిసాన్ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ధరణిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో కీలకంగా ఉన్నారు. విత్తనాలు, పురుగులు మందులు, నకిలీల బెడద తదితర అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు ప్రభుత్వం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయలని భావిస్తోంది. ఈ  బాధ్యతలను కోదండరెడ్డికే కట్టబెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.