
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ 9231 ఖాళీల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో నేరుగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గురుకులం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
తెలంగాణ గురుకులం నోటిఫికేషన్–2023లో 9231 ఖాళీలు ఉన్నాయి. టీఎస్ గురుకులం లెక్చరర్/ ఫిజికల్ డిగ్రీ డైరెక్టర్/ ఫిజికల్ డైరెక్టర్ డిగ్రీ కళాశాలలు & జూనియర్ కళాశాలల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు 17 ఏప్రిల్ 2023న ప్రారంభమవగా, టీఎస్ గురుకులం టీజీటీ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ ఏప్రిల్ 28న ప్రారంభమవుతుంది. ఇతర పోస్ట్‌ల ఆన్‌లైన్ దరఖాస్తు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమవుతుంది.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ :
గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ఐదు అంచెల్లో ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (బీటీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసి 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. ఒక అభ్యర్థి తన అర్హతల మేరకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థి ఆన్‌లైన్‌లో ప్రతిసారి అప్లికేషన్ సమయంలో వివరాలను సమర్పించాల్సిన అవ సరం లేకుండా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియ తీసుకొచ్చింది. టీఎస్‌పీఎస్సీ మోడల్ అనుసరిస్తూ ప్రతి అభ్యర్థికీ ఓటీఆర్ తప్పనిసరి చేసింది.
జూనియర్ లెక్చరర్ :
ఈ పోస్టు కోసం పీజీ సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పాటు బీఈడీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ నుంచి- 100 మార్కులు ఉంటాయి. పేపర్-2 సంబంధిత సబ్జెక్టులో బోధన పద్ధతులు- 100 మార్కులకు ఇస్తారు. పేపర్-3లో సంబంధిత సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం ఆధారంగా- 100 మార్కులు ఉంటాయి. డెమోకు 25 మార్కులతో మొత్తం 325 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు మే 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
లైబ్రేరియన్ (జూనియర్ కాలేజ్) :
డిగ్రీతో పాటు లైబ్రరీసైన్స్‌లో 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. పేపర్-1 కామన్ ఉంటుంది. డెమోకు 25 మార్కులు ఉంటాయి. పేపర్-2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్-నుంచి 100 మార్కులు ఇస్తారు. మొత్తం 50 పోస్టులు ఉన్నాయి.
ఫిజికల్ డైరెక్టర్ (జూనియర్ కాలేజ్) :
ఎన్‌సీఈటీ నిబంధనలకు లోబడి బీపీఈడీ అర్హత కలిగి ఉండాలి. పేపర్-1 కామన్‌గా ఉంటుంది. డెమోకు 25 మార్కులు ఉంటాయి. పేపర్-2లో ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి- 100 మార్కులు వస్తాయి. మొత్తం 34 ఖాళీలు ఉన్నాయి.
డిగ్రీ లెక్చరర్ :
ఈ పోస్టుకు పీజీలో 55 శాతం మార్కులతో పాటు యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ లేదా రాష్ట్రాలు నిర్వహించే స్లెట్/సెట్ అర్హత తప్పనిసరి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5% మార్కులు, 1991కు ముందు పీహెచ్‌డీ పట్టా పొందిన వారికి పీజీలో 5% మార్కుల సడలింపు ఉంటుంది. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ నుంచి- 100 మార్కులు, పేపర్-2 నుంచి సంబంధిత సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం పీజీస్థాయిలో - 100 మార్కులకు ఉంటుంది. డెమోకు 25 మార్కులతో కలిపి మొత్తం 225 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఫిజికల్ డైరెక్టర్ (డిగ్రీ కాలేజ్ ) :
ఈ పోస్టులకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పీజీలో 55 శాతం మార్కులతో పాటు యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ లేదా రాష్ట్రాలు నిర్వహించే స్లెట్/సెట్ అర్హత తప్పనిసరి. పీహెచ్‌డీ చేస్తే వారికి యూజీసీ నెట్, రాష్ట్రాల సెట్ నుంచి మినహాయింపు ఉంటుంది. పేపర్-1 కామన్‌గా ఉంటుంది. పేపర్-2 సంబంధిత ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం (పీజీస్థాయి) మీద- 100 మార్కులకు ఉంటుంది. డెమోకు 25 మార్కులతో కలిపి మొత్తం 225 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఖాళీలు 39 ఉన్నాయి.
లైబ్రేరియన్ (డిగ్రీ కాలేజ్) :
ఈ పోస్టుకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పీజీలో 55 శాతం మార్కులతో పాటు యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ లేదా రాష్ట్రాలు నిర్వహించే స్లెట్/సెట్ అర్హత తప్పనిసరి. పీహెచ్‌డీ చేసిన వారికి యూజీసీ నెట్, రాష్ట్రాల సెట్ నుంచి మినహాయింపు ఉంటుంది. పేపర్-1 100 మార్కులకు కామన్‌గా ఉంటుంది. పేపర్-2 సంబంధిత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం మీద 100 మార్కులకు, డెమో 25 మొత్తం 225 మార్కులకు పరీక్ష ఉంటుంది. పోస్టులు 36 ఖాళీగా ఉన్నాయి.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) :
తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులు 4020 ఖాళీలున్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకు ఉంటుంది.
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ ) :
తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లో 1276 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఉంటుంది.
అర్హతలుంటే అన్నీ అప్లై చేయాలి :
అర్హత ఉన్న అభ్యర్థులు ఒకటికి మించి ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకొని, ప్రిపేర్ అవడం ఉత్తమం. ఈ నోటిఫికేషన్లు అన్నీ జనరల్ స్టడీస్‌తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టుల జ్ఞానాన్ని పరిశీలించే పరీక్షలకు చెందినవి.
ప్రిపరేషన్లో క్లారిటీ ఉండాలి :
గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయోమయానికి గురికాకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. గురుకుల నోటిఫికేషన్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో అర్హులైన అభ్యర్థులు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈ పరీక్షలపైన ఫోకస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పరీక్ష స్థాయిని బట్టి ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకు డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్‌లో పెడగాజి సిలబస్‌గా ఉంది. డిగ్రీ లెక్చరర్స్ పరీక్షలో అడిగే ప్రశ్నల స్థాయి జూనియర్ లెక్చరర్ ప్రశ్నల స్థాయి కంటే అధికంగా ఉండవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పరీక్షలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇదే విషయం జనరల్ స్టడీస్ విషయంలోనూ వర్తిస్తుంది.
జాబ్ డిసైడ్ చేసే జనరల్ స్టడీస్
పరీక్ష ఏదైనా ఉద్యోగం సాధించడంలో జనరల్ స్టడీస్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇలాంటి సబ్జెక్టు ప్రత్యేక పరీక్షల్లో మెరిట్ అభ్యర్థులందరికీ సబ్జెక్టుల్లో దాదాపు సమాన మార్కులే వస్తాయి. జనరల్ స్టడీస్‌లో వచ్చే మార్కులే ఫైనల్‌గా జాబ్ డిసైడ్ చేస్తుంది. అందుకే మిగతా సబ్జెక్టులతో పాటు జీఎస్‌కు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. కచ్చితంగా జనరల్ స్టడీస్‌లో ఉండే సిలబస్ ఎక్కువే అయినప్పటికీ సరైన ప్రణాళికతో ముందుకెళ్తే మంచి మార్కులు సాధించవచ్చు. జనరల్ స్టడీస్ సిలబస్ అంశాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు తాజాగా ప్రశ్నల ధోరణిలో వస్తున్న మార్పులను ముందుగా అర్థం చేసుకోవాలి. ఆపై ఒక్కొక్క విభాగాన్ని అవసరమైనంత లోతుగా చదవాలి.
-వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్