తెలంగాణను నిరుద్యోగ రాజధానిగా మార్చారు : పవన్​ ఖేరా

తెలంగాణను నిరుద్యోగ రాజధానిగా మార్చారు : పవన్​ ఖేరా

హైదరాబాద్, వెలుగు : వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్​సర్కార్​.. ప్రజలను నిలువునా వంచించిందని ఏఐసీసీ మీడియా ఇన్​చార్జ్, సీడబ్ల్యూసీ మెంబర్​ పవన్​ ఖేరా మండిపడ్డారు. కేసీఆర్​ ప్రభుత్వం మోసం, అవినీతి, దుర్మార్గం, కమీషన్లు అనే నాలుగు చక్రాల మీదే నడుస్తున్నదని విమర్శించారు. నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచిన కేసీఆర్​.. రాష్ట్రాన్ని నిరుద్యోగ రాజధానిగా మార్చారని ఫైర్ అయ్యారు.  

ఇలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పార్టీ రాష్ట్ర కమ్యూనికేషన్​ ఇన్​చార్జ్ అజయ్​ కుమార్​ ఘోష్​, కుసుమ కుమార్, చామల కిరణ్​ కుమార్​ రెడ్డితో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్​లో  కేసీఆర్​ రాజభోగాలు అనుభవిస్తుంటే.. ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పవన్ ఖేరా విమర్శించారు. కేసీఆర్​ను ప్రజలే ఇక ఫాంహౌస్​కు పంపుతారని, ఆయన అక్కడే శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవచ్చని చెప్పారు. ‘‘ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం ఒక్క 2020లోనే 3,600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. టీఎస్​పీఎస్సీ భ్రష్టు పట్టిపోయింది. పరీక్ష ఫీజుల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.220 కోట్లు సర్కార్​ దోచుకుంది. అయినా ఒక్క పరీక్షనూ సరిగ్గా నిర్వహించలేకపోయింది. ఆ డబ్బులన్నీ ఎక్కడికిపోయాయి. ఉద్యోగం రాలేదని ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే.. ఆమె క్యారెక్టర్​పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆయన ఫైర్​ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సరైన మీట మీద నొక్కి కేసీఆర్​ను ఇంటికి పంపాలని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను పవన్ ఖేరా  కోరారు.