దశాబ్దిలోకి తెలంగాణ.. మళ్లా పిడికిలి బిగించాలె

దశాబ్దిలోకి తెలంగాణ.. మళ్లా పిడికిలి బిగించాలె

కోటి ఆశలు, ఆకాంక్షలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ పదేండ్లు పూర్తి చేసుకున్నది. ఉద్యమాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్​కు రెండు దఫాలు అధికారం దక్కింది. నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం.. ఇవీ తెలంగాణ ఉద్యమ ప్రధాన నినాదాలు. ప్రజాస్వామిక స్వేచ్ఛ, సంక్షేమం, సాధికారికత, వలసవాదపు ఆధిపత్యం తొలగడం వంటివి ప్రధాన ఆకాంక్షలు. ఈ ఆశలు, ఆకాంక్షలే ప్రజాఉద్యమంగా మారి ప్రత్యేక రాష్ట్ర సాధనకు మూలమయ్యాయి. దాదాపు అన్ని పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, సబ్బండ వర్గాలు, ఉత్సాహంగా కదలబట్టే రాష్ట్ర సాధన సాధ్యమైంది.

దాదాపు 60–65 ఏండ్లు పాలించిన పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయని ప్రజలు విశ్వసించడం వల్లే ఉద్యమం జోరందుకుంది. విద్య, ఉద్యోగాల్లో అన్యాయాన్ని సహించలేకే విద్యార్థిలోకం గట్టిగా నిలబడింది. తెగించి కొట్లాడింది. యువత ప్రత్యేక కాంక్షకోసం ఆత్మహత్యలదాకా వెళ్లింది. వందల బలిదానాలు జరిగాయి. కేంద్రం లొంగక తప్పలేదు. మిలియన్ మార్చ్, సాగరహారం, వంటావార్పులు.. వంటివి వందలాది గ్రామాలను కదిలించాయి. ఏ ఒక్కరి వల్లనో తెలంగాణ రాలేదని అనాటి పరిస్థితులు చెబుతున్నాయి. తెలంగాణ సమాజం మొత్తం కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రం ఇది. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తుందని అందరూ భావించారు. కానీ ఈ పదేండ్ల పాలనలో ప్రజల ఆశలన్నీ ఆవిరయ్యాయి.

ఎంత మందికిచ్చారు ఇండ్లు?

ఈ పదేండ్లలో ఇండ్లు లేని పేదవారికి జాగా ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు ఎంత మందికి ఇచ్చారు. ఇచ్చినవి కూడా నాసిరకం. హౌసింగ్ బోర్డును రద్దు చేశారు. పాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు బిల్లులు ఇవ్వలేదు. ఇల్లు కట్టుకుంటే 3 లక్షలుంటున్నరు.. ఇస్తరా? ఇది కూడా ఎన్నికల హామీనే.. మళ్లీ ఆశ పెడుతున్నరు. కొత్త రేషన్ కార్డుల ముచ్చట ఎప్పటిది? అప్లకేషన్​ పెట్టుకుని జనం ఎదురు చూస్తున్నరు. ఇంకా ఎన్ని రోజులు నాన్చుతరు? జీవో 58, 59 కింద క్రమబద్ధీకరణ ఎవరి లాభం కోసం చేస్తున్నరు. కార్పొరేట్ ​కంపెనీలకు వందల ఎకరాల ఇచ్చేస్తున్నరు. పంచాయతీలకు నిధులు లేవు. కాంట్రాక్టులకు బిల్లులు లేవు. ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలారు. ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ. 

రుణమాఫీ ఏమైంది?

రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నరు. సబ్సిడీలన్నీ ఎత్తేశారు. గిట్టుబాటు ధర లేదు. వడ్లు కొనే నాథుడు లేడు. ఇదెలా రైతు రాజ్యం అయితది. కొనుగోళ్లను ఎందుకు అశ్రద్ధ చేస్తున్నరు. కౌలు చేసేవాళ్లు రైతులు కాదా? పంట నష్టం జరిగితే నష్టపోయేది కౌలు రైతు కాదా? వాళ్లకు ఎందుకు సాయం చేయరు? ధనిక, వందల ఎకరాలున్నా కార్పొరేట్ రైతులకే రైతుబంధు లాభదాయకంగా మారింది. ఇంకా రాష్ట్రంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతున్నయ్. రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నయ్​. ఈ విషయాలపై సీఎం ఎందుకు స్పందించరు?

పోడు భూముల సంగతి తేల్చరా?

పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పారు. నేటికి ఇవ్వలేదు. 11 లక్షల ఎకరాల పోడు భూములున్నాయి. ఈ 24వ తేదీ నుంచి 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తామంటున్నాడు. ఇది 25% కూడా లేదు. వాగ్దానం ప్రకారం అందరికీ సాగుహక్కు ఇవ్వాలి. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. కాళేశ్వరం అద్భుతమని ప్రభుత్వం గొప్పలు చెప్పుతున్నది. ఈ ప్రాజెక్టుతో కొత్తగా సాగులోకి వచ్చిందెంత? లెక్కలతో సహా చెప్పగలరా? కోటి ఎకరాలకు నీళ్లిస్తున్నామని చెప్తున్నరు? ఎక్కడిస్తున్నరు? శ్వేతపత్రం విడుదల చేయాలి. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన కాళేశ్వరంతో ఏం ఉపయోగం ఉందో చెప్పాలి. ఎక్కడైనా సాగునీటి కాలువలు తీశారా? ఏంటి ఉపయోగం? చేతలు మూరెడు, ప్రచారం బారెడు అన్నట్టుంది ఈ సర్కారు తీరు. 

ఇంత నిరంకుశత్వమా?

ఈ పదేండ్లలో ఒక కుటుంబ కేంద్రీకృత పాలనే సాగింది. పోలీసులకు విచ్చలవిడి అధికారం ఇచ్చారు. వాళ్లు చట్టాన్ని పక్కనపెట్టి టీఆర్ఎస్ నేతల చుట్టాలుగా వ్యవహరిస్తున్నరు. ప్రజాస్వామ్య ఆకాంక్షలను తొక్కివేస్తూ, ధర్నా చౌక్​నే రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ఏ మంత్రి, ఏ ప్రాంతానికి వచ్చినా అక్కడి ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఏం ప్రజాస్వామ్యం. ప్రతిపక్ష, ప్రజాస్వామిక నేతలపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారు. కేసులు పెట్టి వేధిస్తున్నారు. కనీసం నిరసన కూడా తెలిపే స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు సీఎం క్యాంపు ఆఫీసు గేట్ల దగ్గరికి కూడా పోలేని నిరంకుశత్వం సాగుతున్నది. ఏ ప్రజాస్వామిక వాంఛలు, వాతావరణం వెల్లివిరుస్తుందని ఉద్యమం సాగించామో ఆ ఆశలు నిరాశలయ్యాయి. తెలంగాణ కొందరి చేతుల్లో బందీగా మారింది.

పౌరసమాజం నోరు మెదపలేని పరిస్థితి

తెలంగాణ సమాజానికి మట్టి వాసనలు తెలుసు, సమాజం మళ్లీ మేల్కొంటుంది. నిజాంకే ఘోరీ కట్టిన గడ్డ ఇది. మళ్లీ ప్రజాస్వామ్యం కోసం, ఆకాంక్షల కోసం రెక్క విప్పుతుంది. పిడికిలి బిగిస్తుంది. 

యూనివర్సిటీ పరిస్థితేంటి?

విద్యారంగం అస్తవ్యస్తంగా తయారైంది. యూనివర్సిటీల్లో వీసీలు, సిబ్బంది నియామకాలు లేవు. సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలకు నిధులు కేటాయించడం లేదు. ఒక రకంగా అవి కొడిగట్టిపోతున్నాయి. గురుకులాల గురించి గొప్పగా చెబుతున్నారు. కానీ వాస్తవం వేరు. ప్రతి హైస్కూల్​ను గురుకులంగా మారిస్తే బాగుంటుంది. పదేండ్లలో ఈ సీఎం ఒక్కసారైనా సమగ్రంగా విద్యారంగంపై సమీక్ష చేశారా?

ఉద్యోగాల కోసం ఇంకెంతకాలం పోరాడాలి?

పదేండ్ల స్వయం పాలనలో తెలంగాణ ఏం సాధించిందన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇంటికో ఉద్యోగం ఏమైంది? అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్న ఉద్యమ పార్టీ ఎన్ని ఖాళీలు నింపింది? ఈ కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్, పార్ట్​ టైమ్​ ఉద్యోగాలేంటని ప్రశ్నించిన లీడర్లు అధికారం చిక్కినంక ఏం చేశారు? ఎందరి ఉద్యోగాలు తీసేశారో.. ఎంతమందిని పర్మినెంట్​చేశారో చెప్పాలి. తొలుత టీఎస్​పీఎస్సీ బాధ్యతలు తీసుకున్న ఘంటా చక్రపాణి.. సీఎం చెప్పినా వినను.. ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని పలికారు. ఇక ఉద్యోగాల జాతరేనన్నారు. కానీ ఏమైంది? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు. లక్షా 40 వేల ఖాళీలని చెప్పి పట్టుమని 40 వేల ఉద్యోగాలు కూడా నింపలేదు.

ఈ మధ్య కాలంలో రిటైరైన వారి సంఖ్యకు కూడా అవి సరిపోవు. జరుగుతున్న నియామకాలుకూడా పారదర్శకంగా లేవు. అందుకు ఇటీవల పరీక్షా పేపర్ల లీకేజీనే ఉదాహరణ. ఇక ఉద్యోగుల్లోనూ ఉద్యమ స్పిరిట్ పోయింది. నాయకత్వం అధికార వలలో చిక్కుకున్నది. పీఆర్సీ, బదిలీలు, ప్రమోషన్లు లేకున్నా కిమ్మనని పరిస్థితి. గడిచిన తొమ్మిదేండ్లలో బదిలీలు, ప్రమోషన్లు లేవంటే ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.

-పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్),  ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి,  తెలంగాణ