
- సంపద సృష్టిస్తున్న ‘మహాలక్ష్మి’
2023 డిసెంబర్ నెల ప్రజాస్వామ్యం కోరుకునే ప్రజలకు ఒక శుభమాసం. అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరతగతిన అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు.
కనీస ఆక్యుపెన్సీ రేషియో లేని బస్సుల్లో ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో పెరగడమే కాకుండాదానిని అధిగమించింది. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైన రోజు నుంచి దాదాపు ఈ రోజువరకు 200 కోట్ల ఉచిత టికెట్స్ద్వారా మహిళలు ప్రయాణం చేశారు.ఈ ప్రయాణ విలువ 6,700 కోట్ల రూపాయలు.
గత పదేండ్లలో (2014–2023 డిసెంబర్) ఆర్టీసీ ఆర్థికంగా ఒడుదొడుకులను ఎదుర్కొంది. వందల కోట్ల నష్టాలలో కూరుకుపోయింది. పండుగల సమయంలో తప్ప మిగతా సమయాలలో కనీస ఆక్యుపెన్సీ రేషియో ఉండేదికాదు. ఉచితబస్సు ప్రయాణం ప్రారంభమైన తరువాత ఆర్టీసీకి జవసత్వాలు చేకూరాయి. ఆర్థికంగా బలపడుతోంది. లాభాల బాటలోకి వస్తోంది. మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి సంజీవినిలాంటిది.
మహిళలకు ఆర్థిక భరోసా
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆస్తులు సృష్టించినట్లు సంపద సృష్టి జరిగింది అని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. అలాగే మహాలక్ష్మి పథకం కూడా ఆస్తులను, సంపదను సృష్టిస్తుంది. నాకు తెలిసిన ఇద్దరు విద్యార్థినులు తెలిపిన సమాచారం ప్రకారం.. వారిద్దరూ ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. తల్లిదండ్రులు దినసరి ఉద్యోగులు. కళాశాల బస్సు ఫీజు ఏడాదికి 30వేల రూపాయలు చెల్లించాలి. వారు బీటెక్ చదవాలా వద్దా అని ఆలోచించే ఆర్థిక పరిస్థితి వారిది.
ప్రస్తుతం ఆ విద్యార్థినులు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని 20కి.మీ. దూరంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలకు సంతోషంగా వెళ్లి వస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకునే మహిళలు మహాలక్ష్ములుగా రూపాంతరం చెందారు. కొంత ఆర్థిక వెసులుబాటును పొందుతారు. ఆర్థిక భరోసా లభిస్తోంది. క్రమంగా మహిళలను కోటీశ్వరులుగా చేస్తామన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ పథకం ఉడతాభక్తిలా సహాయపడుతుంది. ఈ ప్రక్రియలనే మహిళల మహాలక్ష్మీకరణం అంటారు.
ప్రభుత్వం అందించే ఆడబిడ్డ కానుక
మహాలక్ష్మి పథకం లేకపోయినట్లయితే ఆర్టీసీ బస్సులలో కనీస ఆక్యుపెన్సీ రేషియో ఉండేది కాదు. వందల కోట్ల రూపాయల నష్టం అనివార్యం అయ్యేది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణంచేసే మహిళలకు మేలు జరగడంతోపాటు ఆర్టీసీ సంస్థకు కూడా మేలు జరుగుతుంది. ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికుల భద్రతకు గ్యారంటీని ఇస్తుంది. రీయింబర్స్‌మెంటు ద్వారా నష్టాన్ని భరిస్తోంది. ఈ పథకం ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే ఆడబిడ్డ కానుక.
మహాలక్ష్ములకు వినతి!
మహాలక్ష్ములకు ఈ సందర్భంగా చేసే మనవి ఏమిటంటే.. టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిని మన సోదరులుగా భావిద్దాం. ప్రభుత్వం ఇచ్చే కానుకను ఆర్టీసీ సిబ్బంది మనకు అందజేస్తున్నారు. ఈ రాఖీ పండుగకు ఆర్టీసీ సిబ్బందికి రక్షాబంధనంగావించి వారికి శుభాకాంక్షలు అందిద్దాం. వారిని గౌరవిస్తే ప్రభుత్వాన్ని గౌరవించినట్టే అవుతుంది. మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకునే మహిళలు ఎంత ఆర్థిక లబ్ధి పొందుతున్నారో రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక మాజీ మంత్రి 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 20 పైసలు కూడా మేలు జరగలేదని ఆరోపిస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులు వీధికెక్కి ఎంత అరిచినా చివరికి వెనుదిరగాల్సిందే. మహాలక్ష్మి పథకం ఓ అద్భుత పథకం. ఇది బహుళ ప్రయోజనకారి అనడం
అతిశయోక్తి కాదు.
ఎన్నో సమస్యలకు పరిష్కారం
ఒక దెబ్బకు రెండు పిట్టలు కాదు కాదు అనేక పిట్టలు. అనగా ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక లాభాలున్నాయి. సమూహ ప్రయాణాలు (మాస్ ట్రాన్స్పోర్ట్) చేయడం వలన వాయు కాలుష్యం తగ్గుతుంది. గాలి నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడ తాయి. కాలుష్య కారకాలు గాలిలో తగ్గుతాయి. హరిత గృహ వాయువులు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ పెరుగుతుంది. కూరగాయలు, పూలు, పండ్లు మొదలైనవి విక్రయించే సామాన్య వర్తక, వ్యాపారులు వివిధ ప్రాంతాల్లోని సంతలకు సులభంగా ప్రయాణించి ఆర్థిక లబ్ధిని పొందుతున్నారు. తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటు న్నారు.
ప్రతిరోజు బస్సులలో ప్రయాణించే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఆర్థిక వెసులుబాటు పొందుతున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం అయిన ప్పటినుంచి ప్రముఖ దేవాలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. ఆయా దేవాలయాల ముందు వర్తక వ్యాపారం పెరిగింది. దేవాలయాలకు హుండీ ఆదాయం కూడా పెరిగినట్టుగా ఆలయాల సిబ్బంది తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలలో కూడా వ్యాపారం పెరిగింది. లక్షలాది మంది విద్యార్థినులకు ప్రతి నెల బస్సు పాస్ బెడద తగ్గింది. ప్రయాణికుల కోసం కొత్త బస్సులు, కొత్త ప్రయాణ ప్రాంగణాలు రాబోతున్నాయి. ఆర్టీసీ సంస్థ నష్టాల బారి నుంచి లాభాల బాటలో పయనిస్తోంది.
- వేణుగోపాల్ నరెడ్ల-