జులై 29.. అంతర్జాతీయ పులుల దినం సందర్భంగా .. జీవ వైవిధ్యంతోనే మానవాళి మనుగడ

జులై 29.. అంతర్జాతీయ పులుల దినం సందర్భంగా  .. జీవ వైవిధ్యంతోనే మానవాళి మనుగడ

ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా అడవుల నరికివేత, అక్రమంగా పులులను వేటాడడం లాంటి పలు కారణాలతో పులి జాతి అంతరించే స్థాయికి చేరడాన్ని గమనించిన ఐరాస ప్రతి ఏట 29 జులై రోజున ‘అంతర్జాతీయ పులుల దినం లేదా ఇంటర్నేషనల్‌‌ టైగర్‌‌ డే’ పాటించడం 2010 నుంచి ఆనవాయితీగా మారింది. 

పులులను కాపాడుకోవడం, వాటి ఆవాసాలను సంరక్షించుకోవడం, అక్రమ వేటలను మానుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రాధాన్యాన్ని వివరించడం, టైగర్‌‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడం, టైగర్‌‌ రిజర్వులను నియంత్రించడం  లాంటి అంశాల్లో సామాన్య జనాలకు అవగాహన కల్పించడానికి ఈ వేదికలను ఉపయోగించుకోవాలి. పిల్లుల జాతిలో అతి పెద్ద జంతువుగా పులికి పేరుంది. 2025 అంతర్జాతీయపులుల దినం ఇతివృత్తంగా మానవులు, పులులు సామరస్యంగా సహజీవనం చేయడం” అనే అంశాన్ని తీసుకొని పులుల సంరక్షణ బాధ్యతలను వివరించడం జరుగుతుంది. 

అత్యధిక పులుల జనాభా భారత్‌‌లోనే ఉన్నదా !

ప్రపంచవ్యాప్తంగా కేవలం 13 దేశాల్లోనే పులులు ఉన్నాయి. ఇండియా(3,682 పులులు), రష్యా (750), ఇండోనేషియా (400), నేపాల్‌‌(355), థాయిలాండ్ (189), భూటాన్‌‌ (151), మలేషియా (150), బంగ్లాదేశ్‌‌ (146), మయన్మార్‌‌(22), చైనా (20), వియత్నాం(05), లావోస్‌‌ (02 పులులు) దేశాల్లోనే పులులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక పులుల జనాభా భారత్‌‌లో ఉన్నందున మన “జాతీయ జంతువు”గా “రాయల్‌‌ టైగర్‌‌”ను నిర్ణయించారు.  భారత ప్రభుత్వ చొరవతో పులుల జాతిని సంరక్షించడానికి 1973లో “ప్రాజెక్ట్‌‌ టైగర్‌‌” 2006లో “జాతీయ పులుల సంరక్షణ అథారిటీ”లను స్థాపించడంతో పాటు 58 టైగర్‌‌ రిజర్వులను నిర్వహించడం జరుగుతోంది.

 ప్రపంచ పులుల్లో 70 శాతానికి పైగా భారత్‌‌లోనే ఉండడం విశేషం. నేడు పులుల జనాభా వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదు అవుతున్నది.  శతాబ్దం క్రితం ఒక లక్ష వరకు ఉన్న పులులు నేడు కేవలం 5,574 మాత్రమే ఉండడం విచారకరం. చర్మం, గోళ్లు, దంతాలు, మాంసం, ఎముకలు, జుట్టు లాంటి అవయవాల కోసం పులులను అక్రమంగా వేటాడి చంపడం జరుగుతోంది. పులుల ఆవాసాలైన అడవులను నరికి వేస్తుండటంతో అవి మానవ ఆవాసాల్లోకి రావడం జరుగుతోంది.

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి–