హైదరాబాద్, వెలుగు: నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ నడిపిన వాళ్లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ విధంగా వాహనం నడిపిన ఓ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసుల తీరును తప్పుపట్టింది. ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆ విధంగా కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించింది. చార్మినార్ పోలీసులు తనపై ఐపీసీలోని 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ వసుందర్ చారి పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టి ఇటీవల పైవిధంగా తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదిస్తూ..గుల్జార్ హౌస్ రోడ్డులో 3 బైకులను తనిఖీ చేస్తుండగా పిటిషనర్ వాహనానికి నెంబర్ ప్లేట్ లేదని పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారని కోర్టుకు చెప్పారు. వాదనల తర్వాత న్యాయమూర్తి, పిటిషనర్‌పై ఉన్న ఒకే ఒక ఆరోపణ నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడపడమని, ఆ వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారని, పిటిషనర్‌పై పోలీసులు సెక్షన్ 420 కింద నమోదు చేసిన కేసు చట్ట వ్యతిరేకమని చెప్పారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపినా సెక్షన్ 80(ఏ) వర్తించదని తెలిపారు. పిటిషనర్ నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే పోలీసులు జరిమానా విధించాలని, లేకుంటే సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని వివరించారు. చీటింగ్ కేసు నమోదు చెల్లదని తీర్పు వెలువరించారు. పిటిషనర్‌పై నమోదు చేసిన కేసులను కొట్టివేశారు.
