నిషేధిత భూముల జాబితాను 9 వారాల్లోగా పంపండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

నిషేధిత భూముల జాబితాను 9 వారాల్లోగా పంపండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక‌‌్షన్ 22ఏ కింద నిషేధ జాబితాలో చేర్చిన భూములు వివరాలను 9 వారాల్లోగా సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ కార్యాలయాలకు పంపాలని, అలాగే వారంలోగా అఫిడవిట్‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. అఫిడవిట్‌‌ దాఖలుకు ఇదే చివరి అవకాశమని.. లేదంటే నేరుగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలకూ వెనుకాడబోమని హెచ్చరించింది. 

రెవెన్యూ జీపీ కట్రం మురళీధర్‌‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు వారం గడువు ఇస్తూ, విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని శంకర్‌‌హిల్స్‌‌ కాలనీలోని 475 గజాల భూమి కొనుగోలుకు సంబంధించి సేల్‌‌ డీడ్‌‌ స్వీకరించకపోవడాన్ని సవాల్‌‌ చేస్తూ గుప్తా రియాల్టీ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌‌పై జస్టిస్‌‌ అనిల్‌‌ కుమార్‌‌ జూకంటి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. 

సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు అనుగుణంగా జీవో 98 ఉందని, కానీ సెక‌‌్షన్‌‌ 22ఏ ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితాను కలెక్టర్లు ఎప్పటికప్పుడు సబ్‌‌-రిజిస్ట్రార్లకు ఎందుకు అందించలేకపోతున్నారని జీపీ మురళీధర్‌‌‌‌ రెడ్డిని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ నెల 1న జారీ చేసిన మెమోను మురళీధర్‌‌రెడ్డి కోర్టు ముందు ఉంచారు. వివిధ సెక‌‌్షన్ల కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూముల వివరాలు వెంటనే పంపాలని కలెక్టర్‌‌‌‌ను కోరామని.. కలెక్టర్లలోపాటు దేవాదాయ శాఖ, వక్ఫ్‌‌ బోర్డు నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నామని ఆయన చెప్పారు.

 పూర్తిస్థాయిలో అమలుకు 12 వారాలు సమయం కావాలని జీపీ కోరారు. 2023లోనే ఈ మేరకు ఆదేశాలిచ్చామని, ఇప్పుడు అంత సమయం ఇవ్వలేమని జడ్జి తేల్చి చెప్పారు. ఎప్పుటికప్పుడు భూముల డేటాను సబ్‌‌ -రిజిస్ట్రార్లకు పంపడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.