బొక్కలు ఇరిగితే ప్రైవేటుకే: ఈటల

బొక్కలు ఇరిగితే ప్రైవేటుకే: ఈటల

హైదరాబాద్​, వెలుగు: సర్కారు దవాఖాన్లలో ఆర్థోపెడిక్​ ఆపరేషన్లకు సౌలతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్లున్నా, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, యంత్రాలు లేకపోవడంతో, ప్రైవేటు హాస్పిటళ్లకు వెళుతున్నారు. రోడ్డు యాక్సిడెంట్లలో తీవ్రంగా గాయపడిన వాళ్లే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. బొక్కల ఆపరేషన్ల కోసం కమ్యూనిటీ హెల్త్​ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లకు వచ్చే రోగులను డాక్టర్లు పెద్దాస్పత్రులకు రిఫర్​ చేస్తున్నారు. అందులో కొంత మంది ప్రైవేటు హాస్పిటళ్లకు వెళుతుండగా, మరికొందరు గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాస్పత్రులకు పోతున్నారు. అయితే, గాంధీ, ఉస్మానియాల్లోనూ పేషెంట్లు ఎక్కువగా ఉండడం, పరికరాలు అరకొరగానే ఉంటుండడంతో, ఆపరేషన్ల కోసం వారం పది రోజులు వెయిట్​ చేయాల్సి వస్తోంది. ఎమర్జెన్సీ కేసుల్లో ఒక్కోసారి వెంటనే ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆలస్యమైతే రోగి పరిస్థితి విషమించే ప్రమాదముంటుంది. కానీ, తీవ్రగాయాలతో వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఆస్పత్రిలో చేరినా వెంటనే ఆపరేషన్​ చేసే పరిస్థితి హాస్పిటళ్లలో ఉండట్లేదు. పేషెంట్లు ఎక్కువగా వస్తుండడంతో ఇటు డాక్టర్లపైనా ఒత్తిడి పెరుగుతోంది.

ఏడాదవుతున్నా కదలని ఫైలు

ఆ సమస్యలను తీర్చేందుకు 35 ఏరియా హాస్పిటళ్లు, 6 జిల్లా హాస్పిటళ్లలో ఆర్థో ఆపరేషన్​ థియేటర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఏడాది కిందటే నిర్ణయించారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈటల రాజేందర్​ తొలి సంతకం చేసిందీ ఆ ఫైలుపైనే. అయితే, ఏడాది అవుతున్నా ఫైలు ముందుకు కదలట్లేదు. ఆపరేషన్లకు అవసరమయ్యే సీఆర్మ్​ యంత్రాలు, ఆర్థో టేబుల్స్​ వంటి పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలోనే ఆగిపోయింది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. మరోవైపు అటు ప్రజలతో పాటు, ఇటు ప్రభుత్వం బొక్కల ఆపరేషన్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఆరోగ్యశ్రీ కింద చేస్తున్న ఆర్థో ఆపరేషన్లలో 90% ప్రైవేటు హాస్పిటళ్లలోనే జరుగుతున్నాయి. అందుకు సర్కారు ఏటా సుమారు రూ.130 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. ఆ ఆపరేషన్లలో కనీసం 50% ఆపరేషన్లను సర్కారు దవాఖాన్లలో చేస్తే ప్రభుత్వ ఖజానాకు రూ.60 నుంచి 70 కోట్లు ఆదా అవుతుంది.