
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: ఢిల్లీలో గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్ -2024–25 అవార్డులు ప్రకటించారు. గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థకు జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు, 3- నుంచి 4 లక్షల జనాభా కేటగిరిలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ (ఎంవోహెచ్‌యూఏ) తొలిసారి ప్రవేశపెట్టిన గార్బేజ్ ఫ్రీ సిటీ (జీఎఫ్ సీ) కేటరిగీలో నగరానికి స్టార్ రేటింగ్ దక్కింది. వరంగల్‌కు గుర్తింపు దక్కడంపై మేయర్గుండు సుధారాణి, నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఆస్పత్రులకు కాయకల్ప అవార్డు..
వరంగల్ జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు గురువారం కేంద్రం ప్రకటించిన కాయకల్ప అవార్డుకు ఎంపికయ్యాయని కలెక్టర్ సత్యశారద, డీఎంహెచ్‌వో సాంబశివరావు తెలిపారు. గీసుకొండ, పర్వతగిరి, సంగెం, నెక్కొండ, నల్లబెల్లి, మేడపల్లి , కేశవాపూర్, అలంకానిపేట, పైడిపల్లి, కీర్తి నగర్, దేశాయిపేట, చింతల్, నర్సంపేట–3, అశోక్ నగర్–1, తిమ్మంపేట్, రెడ్లవాడ, ఇటికాలపల్లి, ధర్మవరం అమీనాబాద్, కోనాపురం, తూర్పు తండా, గవిచర్ల ఆస్పత్రులు 2024–25 సంవత్సరానికి సంబంధించి అవార్డుకు ఎంపికయ్యాయని పేర్కొన్నారు.
కోమట్లగూడెం ఆస్పత్రి బెస్ట్ పీహెచ్సీ
మహబూబాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో మహబూబాబాద్ జిల్లా ముందంజలో నిలిచినట్లు డీఎంహెచ్‌వో రవి రాథోడ్ తెలిపారు. కోమట్లగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బెస్ట్ ఆరోగ్య కేంద్రంగా ఎంపికై, రూ.2 లక్షల నగదు బహుమతి గెలుపొందగా.. మరిపెడ, కురవి, కొత్తగూడ, కేసముద్రం, ఇనుగుర్తి, దంతాలపల్లి మల్యాల, నెల్లికుదురు, బలపాల ఆస్పత్రులు మరోసారి ప్రోత్సాహక బహుమతులు గెలిచినట్లు పేర్కొన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి పర్వతగిరి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బెస్ట్ హాస్పిటల్‌గా ఎంపికైందని పేర్కొన్నారు.