
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన ఓ బాలుడు రైలెక్కి స్టేషన్ఘన్పూర్చేరుకున్నాడు.. పోలీసులు అతని వివరాలు తెలుసుకొని హైదరాబాద్తీసుకెళ్లి, తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ వేణు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని దుండిగల్‌కు చెందిన పుష్పలీల కుమారుడు గణేశ్(8) బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలెక్కి, మధ్యాహ్నం స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేస్టేషన్లో దిగాడు. బైక్‌లపై వెళ్లేవారిని లిఫ్ట్అడుగుతూ.. నమిలిగొండ బస్టాప్వద్దకు చేరుకున్నాడు. అక్కడి చెరువులో ఈత కొట్టి, గ్రామంలోకి నడిచి వెళ్లాడు. వీధుల్లో తచ్చాడుతున్న ఆ బాలుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అతన్ని ఠాణాకు తీసుకెళ్లారు.
వివరాలు అడగా తన పేరు గణేశ్, తల్లి పేరు పుష్పలీల అని తెలిపాడు. హైదరాబాద్‌లోని దుండిగల్ లో ఉంటామని, ఎస్ఆర్నగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నానని చెప్పాడు. సీఐ వేణు అక్కడి పోలీస్ స్టేషన్లకు ఫోన్‌చేసి, వాకబు చేశారు. బాలుడి తల్లి పుష్పలీలతో ఫోన్లో మాట్లాడగా.. తన కొడుకు ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించింది. కానిస్టేబుల్ సాయిచరణ్ గురువారం గణేశ్‌ను హైదరాబాద్తీసుకెళ్లి, అతని తల్లికి అప్పగించారు.