
ఆలేరు (యాదాద్రి), వెలుగు : మహిళాభ్యున్నతే లక్ష్యంగా తమ సర్కారు ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా గురువారం ఆలేరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఐకేపీ సెంటర్ల నిర్వహణ అప్పగించడంతోపాటు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు రూ.51 కోట్లు, వడ్డీ లేని రుణాల కింద రూ.1.44 కోట్ల చెక్కులు, ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు, డీఆర్డీఏ నాగిరెడ్డి పాల్గొన్నారు.
బస్సు సర్వీస్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ఐలయ్య
కొత్త ఆర్టీసీ సర్వీస్‌ను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. స్వయంగా కొద్దిసేపు బస్సు నడిపించారు. కూకట్పల్లి డిపోకు చెందిన బస్సు జగద్గిరిగుట్ట నుంచి భువనగిరి, ఆలేరు, మంతపురి, మాటూరు మీదుగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన జీడికల్వరకు ప్రారంభించారు.
ఫైర్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి..
యాదగిరిగుట్ట, వెలుగు : అగ్నిప్రమాదాలు సంభవించిన సమయంలో ఫైర్ సిబ్బంది సేవలు వెలకట్టలేనిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కొనియాడారు. గురువారం యాదగిరిగుట్టలోని పాత గోశాల ప్రాంగణంలో 'ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్(షేక్ మెట్ ఫార్మా వెంచర్స్)' సహకారంతో రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్ర భవనాన్ని ఎమ్మెల్సీ సత్యంతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఫైరింజన్లు, పనిముట్లు, పరికరాలు, మిషన్లను పరిశీలించారు.
అనంతరం రూ.60 లక్షల విరాళంగా ఇచ్చి బిల్డింగ్ నిర్మాణానికి సహకరించిన'ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అభినందనలు తెలిపారు. కంపెనీ చీఫ్ హెచ్ఆర్ వో ఉమారాణి, ఆపరేషన్స్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ రెడ్డి, హెచ్ఆర్ అసోసియేట్ డైరెక్టర్ నాగుల దేవేందర్ రెడ్డిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.