కుండపోత వర్షాలు.. లైవ్ అప్డేట్స్..

కుండపోత వర్షాలు.. లైవ్ అప్డేట్స్..

రాష్ట్రంపై వరుణుడి ప్రకోపం కొనసాగుతోంది. భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది.కొన్ని రోజులుగా  కుండపోతగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. వరద పోటెత్తుటుండటంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఇన్ ఫ్లో అంతకంతకూ పెరుగుతుండటంతో కొన్ని జలాశయాలు ప్రమాదం అంచుకు చేరాయి. హైదరాబాద్ లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

కడెం తెగిపోయినట్టుగా వదంతులు.. అవాస్తవమని వెల్లడి

కడెం ప్రాజెక్టు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయి, ఓవర్ ఫ్లో అవుతోంది. నీరు కట్టను తాకుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉంది.  ఇక కడెం ప్రాజెక్టు తెగిపోయినట్టుగా ప్రసారం అవుతున్న వీడియోలు వాస్తవం కాదని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. డ్యాం బ్రేక్ అయినట్టు ఇంజనీర్ల నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. క్యాచ్మెంట్ ఏరియాలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోందన్నారు. 

కడెం ప్రాజెక్టుకు మూడు చోట్ల గండి

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు మూడు చోట్ల గండిపడింది. మైసమ్మ గుడి, ఎడమ కాలువ, పవర్ హౌస్ వద్ద గండ్లు పడ్డాయి. దీంతో వరద నీరు చేరి వందలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. 

భారీ వర్షాలకు పలు రైళ్లు రద్దు

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేపధ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు అప్రమత్తమ్యయారు. ముందు జాగ్రత్త చర్యగా రేపటి నుంచి ఈ నెల 17 వ‌ర‌కు పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. 

ఎస్సారెస్పీ 36 గేట్లు ఎత్తివేత

శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో అధికారులు 36 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4 లక్షల 19  వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో  4 లక్షల 50వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1088 అడుగులుగా ఉంది.

జలదిగ్బంధంలో గ్రామాలకు తాడు సాయంతో సరుకులు 

ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పపురం పంచాయితీ పరిధిలోని ఐదు గిరిజన గ్రామాలు జలదిగ్భంనంలో చిక్కుకున్నాయి.  4 రోజులుగా నిత్యావసర సరుకులు లేక ప్రజలు తిండికి ఇబ్బంది పడుతుండడంతో అధికారులు నిత్యావసర వస్తువులు, కూరగాయాలు సిద్ధం చేశారు. అయితే ఆయా గ్రామాలకు పోయే దారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సరుకుల పంపిణీకి బ్రేక్ పడింది. దీంతో వాగుపై పెద్ద తాడును సిద్ధం చేయగా..  గ్రామస్తులు తాడు సాయంతో ఇవతలకు వచ్చి కూరగాయలు, నిత్యావసర వస్తువులు తీసుకెళ్లారు. 
 

ఎరువుల ఫ్యాక్టరీలోకి వరద నీరు

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలోకి భారీగా వరదనీరు చేరింది. ఈదురు గాలుల కారణంగా ఫ్యాక్టరీలోని అమోనియా యూనిట్, ఆర్సీ యూనిట్, బ్యాంగింగ్ యూనిట్లలో పై కప్పులు ఎగిరిపోయాయి. ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. కన్వేయర్ ప్రాంతానికి వరద నీరు భారీగా చేరడంతో యూరియా బస్తాలు నీటిలో తడిచి కరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నష్టం ఎంత మేరకు జరిగిందనేది తెలియాల్సి ఉంది. 
 

సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా నీరు.. పూర్తిగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు భారీగా చేరింది. గత ఏడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణంగా కొత్తగూడెం సింగరేణి  ఉపరితల బొగ్గు గని జీ.కె.ఓ.సీ.లోకి వరద నీరు చేరడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఏడు రోజులుగా సుమారు 45 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 

ఓవర్ ఫ్లో అవుతున్న కడెం ప్రాజెక్టు

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద మళ్ళీ టెన్షన్ వాతావరణం నెలకొంది. జలాశయంలోకి భారీగా వరద చేరుతుండటంతో పవర్ హౌస్ నుంచి ఓవర్ ఫ్లో అవుతోంది. దీంతో కడెం గ్రామంతో పాటు నవాబు పేట్, అంబారి పేట్, దేవునిగూడెం, దాస్తురాబాద్, పెరకపల్లి, మున్యాల్, రేవోజి పేట్, మల్లాపూర్, కలమడుగు, మురిమడుగు, జన్నారం ప్రాంత ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. 

పునరావాస కేంద్రాలకు జనం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకు వరద నీటిమట్టం 16. 930 మీటర్లకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

పూర్తిగా నిండిన నారాయణపూర్ రిజర్వాయర్ 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్ లో భారీగా వరద నీరు చేరుతోంది. 0.25 టీఎంసీల సామర్థ్యంకలిగిన ఈ జలాశయం పూర్తిగా నిండి ప్రమాదం అంచుకు చేరింది. దీంతో రిజర్వాయర్ సమీపంలోని నార్లాపూర్, నారాయణపూర్ గ్రామస్థులును అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, అధికారులతో కలిసి రిజర్వాయర్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. 

లోవర్ మానేరుకు కొనసాగుతున్న వరద

లోవర్ మానేరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 10.329 టీఎంసీలకు చేరింది. 21,352 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. 239 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. 

మిడ్ మానేరుకు పోటెత్తుతున్న వరద

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 56,506 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. శ్రీరాం సాగర్ నుంచి 10వేలు, నర్మాల ప్రాజెక్టు అలుగు పారుతుండటంతో మానేరు, మూల, గంజి వాగుల ద్వారా 43,306 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 318 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 310.23 మీటర్లకు చేరడంతో  ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశముందని అధికారులు చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు 85 గేట్లు ఎత్తివేత

కుండపోత వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు భారీగా చేరడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని 85 గేట్లు ఒకేసారి ఎత్తివేశారు. దీంతో ములుగు జిల్లాలోని గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద రెండో ప్రమాద  హెచ్చరిక జారీ చేశారు. 

రాష్ట్రానికి రెడ్ అలర్ట్
కుండపోత వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి  రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనుండగా.. మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే చాన్సుందని హెచ్చరించింది. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల ,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ అర్బన్..రూరల్, జనగాం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పింది.

విద్యా సంస్థలకు  సెలవులు పొడగింపు
వర్షాల నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులను ప్రభుత్వం పొడగించింది.  భారీ వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో.. నేటితో ముగుస్తున్న సెలవులను శనివారం వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం సెలవు కావడంతో తిరిగి సోమవారం విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

ఎస్సారెస్పీ దిగువ ప్రాంతాలకు ముంపు ముప్పు
శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో 4లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్నందున నదీ పరివాహక ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.