
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ వేసిన వేర్వేరు పిటిషన్ల విచారణ జులై 3కి వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సి.ఆర్యమ సుందరం వాదించేందుకు నిలబడగానే.. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి కల్పించుకుని విచారణ వాయిదా వేయాలని పట్టుబట్టారు. పిటిషన్ విచారణార్హతపై తేలాల్సి ఉందని, అంతేకాకుండా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేందర్ గుప్తా మృతికి కోర్టు సంతాపం తెలపనుందని, ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని ఆయన కోరారు. సీనియర్ న్యాయవాది సి.ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్‌కు ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.
మార్చిలో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే ఫలితం లేదన్నారు. ఒక పార్టీ నుంచి గెలుపొంది మరో పార్టీలో చేరడం ప్రజాతీర్పును కాలరాయడమే అని అన్నారు. అసెంబ్లీ రూల్ 6 ప్రకారం స్పీకర్ తన ముందున్న ఫిర్యాదుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఫిరాయింపులను ప్రోత్సహించినట్లే అని సుందరం అన్నారు. మహారాష్ట్రలో శివసేన కేసులో, మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో వెలువడిన తీర్పులను అమలు చేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. విచారణను జులై 3కి వాయిదా వేసింది.