కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ వాయిదా

కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌‌‌‌ కుంగిపోయిన ఘటనపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రిజర్వాయర్‌‌‌‌ కుంగిపోవడంపై జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ కాంగ్రెస్‌‌ నాయకుడు జి.నిరంజన్‌‌ పిల్‌‌ దాఖలు చేశారు. కాగా, కుంగుబాటు అంశంపై రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్‌‌ (ఈసీ), జాతీయ విపత్తుల నిర్వహణ మండలికి ఫిర్యాదు చేశానని పిటిషనర్‌‌‌‌ పేర్కొనడంలో అంతర్యం ఏంటో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. 

అదేవిధంగా ప్రాజెక్టుల భద్రతపై సెంట్రల్‌‌ బ్యూరో ఆఫ్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ (సీబీఐ), ఇతర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయని అడిగింది. మేడిగడ్డ రిజర్వాయర్‌‌‌‌ కుంగుబాటుకు బాధ్యులెవరో తేల్చే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ పిటిషనర్‌‌‌‌ వేసిన పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ జె.అనిల్‌‌ కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ మంగళవారం విచారించింది. మేడిగడ్డ కుంగుబాటు అంశంతో పాటు కాళేశ్వరం ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్‌‌ కార్పొరేషన్‌‌ లిమిటెడ్‌‌ రూ.86 వేల కోట్ల సేకరణ వ్యవహారంపై సీబీఐ, సీరియస్‌‌ ఫ్రాడ్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ ఆఫీస్‌‌ (ఎస్‌‌ఎఫ్‌‌ఎఓ)లతో దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును పిటిషనర్‌‌ కోరారు. 

నవంబర్‌‌ 1న నేషనల్‌‌ డ్యాం సేఫ్టీ కౌన్సిల్‌‌ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని కుంగుబాటుకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌‌ కేసుల నమోదుకు ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, పిల్‌‌పై విచారణ అర్హత గురించి ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని అదనపు అడ్వకేట్‌‌ జనరల్‌‌ రజనీకాంత్‌‌ రెడ్డిని ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.