బుద్వేల్ భూముల వేలంపై ఉత్కంఠ

బుద్వేల్ భూముల వేలంపై ఉత్కంఠ
  • బుద్వేల్ భూముల వేలంపై ఉత్కంఠ
  • వకీళ్ల పిల్ పై హైకోర్టు ఏం చెబుతుంది..?
  • రేపటి ఈ-వేలం ఉంటుందా..? లేదా..?
  • ఆ జాగా హైకోర్టుకు కేటాయించాలంటున్న అడ్వొకేట్లు
  • 2012 మార్చి 12న 100 ఎకరాల జాగాకు ప్రతిపాదన ఇచ్చామని వెల్లడి
  • 282, 299 సర్వే నంబర్లలోని ఆ జాగానే వేలం పెట్టారు
  • తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అభ్యంతరం

హైదరాబాద్ : కోకాపేట భూములకు కోట్లలో ఆదాయం రావడంతో అదే ఊపుతో హెచ్ఎండీఏ పలుచోట్ల జాగాల అమ్మకానికి రెడీ అయ్యింది. ఇక్కడ వందెకరాల విస్తీర్ణం ఉన్న 14 ప్లాట్ల అమ్మకానికి రేపు వేలం పాట నిర్వహించనుంది. బుద్వేల్ భూముల అమ్మకం నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ స్థలాన్ని హైకోర్టుకు కేటాయించాలని 2012 మార్చి 12న ప్రతిపాదన వెళ్లిందని చెబుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లోని సర్వేనెంబర్ 282, 299 లో ఉన్న 100 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ వేలానికి ఉంచాయి. ఆ వేలాన్ని అడ్డుకొని, ఆ భూమిని హైకోర్టుకు కేటాయించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ కార్యవర్గానికి చెందిన కొందరు సభ్యులు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే కు వినతిపత్రం సమర్పించారు. 

హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కట్టా ప్రదీప్ రెడ్డి హైకోర్టులో అసోసియేషన్ తరఫున పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల ముఖ్య కార్యదర్శులు, లా సెక్రటరీ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌లను ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టుకు బుద్వేల్ లో భూములు కేటాయించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ అది పెండింగ్లో ఉంది. ఈనెల 4న ఆ భూములను వేలం వేస్తున్నట్టు హెచ్ఎండీఏ పత్రికా ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన జారీ చేయడం సరికాదని తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ పేర్కొంటోంది. ఆగస్టు 10 భూముల వేలం ఉన్నందున ఇవాళే సీజే బెంచ్ విచారణకు స్వీకరించి ఈ ఆక్షన్ నిలుపుదలకు ఆదేశాలు ఇవ్వాలని కట్టా ప్రదీప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బుద్వేల్ భూముల అమ్మకంపై నీలినీడలు అలుముకొన్నాయి. హైకోర్టు దీనిపై ఎలాంటి తీర్పు వెల్లడించబోతోందోననే ఉత్కంఠ ఇటు రియల్ సంస్థల్లో.. అటు హెచ్ఎండీఏ అధికారుల్లోనూ నెలకొంది.