
హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్2 పోస్ట్‌ల భర్తీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షలకు అనుగుణంగానే పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు అంగీకరించింది.
రాత పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ అభినంద్ కుమార్ సావిలి, జస్టిస్ అనిల్‌కుమార్‌ల డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులిచ్చింది.
70 వేల మంది పరీక్షలు రాసి 40 వేల మంది అర్హత పొందారని, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరుతూ సింగరేణి మేనేజ్మెంట్ అప్పీల్‌ను హైకోర్టు ఆమోదించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసి డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేయడంతో పోస్టుల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమమైంది.