కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ? .. సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమన్న హైకోర్టు!

కాళేశ్వరంపై  సీబీఐ ఎంక్వైరీ? ..  సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమన్న హైకోర్టు!

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం లక్ష కోట్లకు అవినీతికి పాల్పడినట్టు అధికార పక్షం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.  మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రమాదం అంచున్న ఉన్నట్టు తేలింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతిని బయటపెట్టేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సర్కారు లేఖ  రాసిన విషయం తెలిసిందే.  

ప్రస్తుత పరిస్థితుల్లో తాము కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ  కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించలేమని హైకోర్టు ప్రభుత్వానికి రిప్లయ్ ఇచ్చినట్టు తెలిసింది. చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని సాల్వ్ చేయడానికి సమయం చాలడం లేదని పేర్కొందని సమాచారం. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ర్గదర్శకాలను కూడా ప్రస్తావించింది. 

ALSO READ :- ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా..

దీనిపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. తాను ఇంకా ఆ లేఖను చూడలేదని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. హైకోర్టు నిర్ణయంతో ప్రభుత్వం ముందు రెండే ఆప్షన్లున్నాయి. ఒకటి సీబీఐతో విచారణ చేయించడం.. రెండో రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ వేయడం. ఈ రెడింటిలో ప్రభుత్వం దేని వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

బడ్జెట్ సమావేశాల్లో విజిలెన్స్ నివేదిక

రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన నివేదికను బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ప్రకారం.. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీతోపాటు ఇరిగేషన్ అధికారుల లోపాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.