సీబీఐ వాదన విన్నాకే తగిన ఆదేశాలు .. ఓఎంసీ దోషుల పిటిషన్లపై హైకోర్టు వ్యాఖ్య

సీబీఐ వాదన విన్నాకే తగిన ఆదేశాలు .. ఓఎంసీ దోషుల పిటిషన్లపై హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్సెండ్ చేయాలని దోషులు వేసిన పిటిషన్ పై సీబీఐ వివరణ వినకుండా తాము ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వాదనలు వినకుండా కింది కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించింది. వేనవి సెలవుల ప్రత్యేక కోర్టులో సుదీర్ఘ విచారణ చేపట్టడం సాధ్యం కాదని తెలిపింది. ఓఎంసీ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్ పై వివరణ ఇవ్వాలని సీబీఐకి అదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. అక్రమ మైనింగ్ కేసులో ఏడేండ్ల జైలు విధిస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రధాన నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డితోపాటు గాలి జనార్ధన్ రెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్లను కోర్టు విచారించింది. 

 పిటిషనర్ న్యాయవాది వాదిస్తూ..ఏడేండ్లలోపు శిక్ష విధించినపుడు హైకోర్టులో తక్షణం బెయిల్ మంజూరు చేయడం సంప్రదాయంగా ఉందని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే మూడున్నరేండ్లు దాకా జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. గతంలో బెయిల్ పై ఉన్నారని, కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించడంలేదని వివరించారు. సీబీఐ తరపు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదిస్తూ..అప్పీళ్లలో కౌంటర్లు దాఖలు చేస్తామని గడువు కావాలని కోరారు. దీనికి అంగీకరించిన కోర్టు విచారణను 28కి వాయిదా వేసింది.