నిషేధిత భూముల జాబితా.. 9 వారాల్లో సబ్‌‌ రిజిస్ట్రార్లకు అందాలి : హైకోర్టు

నిషేధిత భూముల జాబితా.. 9 వారాల్లో సబ్‌‌ రిజిస్ట్రార్లకు అందాలి : హైకోర్టు
  • కలెక్టర్లకు సీఎస్‌‌ ఆదేశాలు జారీ చేయాలి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్‌‌ చట్టంలోని సెక్షన్‌‌ 22ఎ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిషేధిత భూముల జాబితాను రూపొందించి.. 9 వారాల్లోగా సబ్‌‌ రిజిస్ట్రార్‌‌లకు అందజేయాలని ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేయాలని, ఉత్తర్వుల అమలు తీరుపై 10 రోజుల్లో అఫిడవిట్‌‌ దాఖలు చేయాలని సీఎస్​కు సూచించింది. భూముల రిజిస్ట్రేషన్‌‌కు వెళ్లినప్పుడు నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ సబ్‌‌ రిజిస్ట్రార్‌‌లు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌‌లపై జస్టిస్‌‌ జూకంటి అనిల్‌‌ కుమార్‌‌ సోమవారం విచారణ చేపట్టారు. 

‘‘ఇలాంటి పిటిషన్‌‌లు దాదాపు 5,100 కు పైగా ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు సబ్‌‌ రిజిస్ట్రార్‌‌లకు అప్పగించాలంటూ పదేండ్ల క్రితం ఫుల్‌‌బెంచ్‌‌ తీర్పు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదు? ప్రజలను ఎందుకు చీకటిలో ఉంచుతారు?”అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ నెల 23న జీవో 98 జారీ చేసిందన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ఈ జీవో అమలు చేయాల్సిన అవసరం ఉందని.. దీని అమలు తీరును పరిశీలిస్తామన్నారు.