మహిళలను మసీదుల్లోకి రానివ్వండి : హైకోర్టు

మహిళలను మసీదుల్లోకి రానివ్వండి : హైకోర్టు
  •  వారి రాజ్యాంగ హక్కులను కాలరాయొద్దు: హైకోర్టు
  •     షియా మహిళలను ప్రార్థనా మందిరాలకు అనుమతించాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది. మహిళల పట్ల వివక్ష తగదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు మసీదు, జాషన్స్, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలని సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

షియా ముస్లిం మహిళలను మసీదు, జాషన్స్​తదితర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు అనుమతించకపోవడంపై ‘అంజుమన్ ఎ అలవి షియా ఇమామియా ఇత్నా అశరి(అక్బరీ) సొసైటీ’ కార్యదర్శి ఆస్మా ఫాతిమా హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్​ను హైకోర్టు జడ్జి జస్టిస్ నగేష్ భీమపాక సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇబ్దతఖానాకు చెందిన ముత్తవల్లీల కమిటీ కేవలం షియా తెగకు చెందిన మహిళలను ప్రార్థనా మందిరాలకు అనుమతించడంలేదని కోర్టుకు తెలిపారు. ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలని వక్ఫ్ బోర్డుకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని చెప్పారు.

వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఖురాన్ ప్రకారమే ప్రార్థనా మందిరాల్లోకి అనుమతి ఉంటుందని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. మహిళల పట్ల వివక్ష ప్రదర్శిచండం తగదని, వారికి రాజ్యాంగం సమానత్వ హక్కులను కల్పించిందని స్పష్టం చేశారు. ఖురాన్, బైబిల్, తోహా, భగవద్గీత వంటి గ్రంథాల్లోని అంశాలతోపాటు వివేకానంద మహిళల గురించి చెప్పిన విషయాలను హైకోర్టు ప్రస్తావించింది.

షియా మహిళలను ప్రార్థనా మందిరాల్లోకి అనుమతించాలంటూ ముత్తవలీ కమిటీని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల నిషేధానికి సంబంధించి అభ్యంతరాలేమిటో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని వక్ఫ్ బోర్డుకు నోటీసు జారీ చేసింది.