స్టేటస్ కో ఆర్డర్​ లేకున్నా ఉన్నట్లు ఎందుకు చెప్పారు?

స్టేటస్ కో ఆర్డర్​ లేకున్నా ఉన్నట్లు ఎందుకు చెప్పారు?
  •     భూ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఎందుకు ఆపారు?
  •     అంబర్‌‌‌‌‌‌‌‌పేట సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ తీరుపై హైకోర్టు ఫైర్
  •     5న వ్యక్తిగతంగా విచారణకు రావాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: అంబర్‌‌‌‌‌‌‌‌పేట సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ తీరుపై హైకోర్టు మండిపడింది. ఓ భూ వివాదం విషయంలో కోర్టు ఉత్తర్వులు ఏమీ లేకున్నా ఉన్నట్లు సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడటాన్ని తప్పుపట్టింది. పెద్దఅంబర్‌‌‌‌‌‌‌‌పేటలోని సర్వే నం.25కి చెందిన ఇనాం దారుల వారసత్వం వివాదంపై గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. 2014లో హైకోర్టు స్టేటస్‌‌‌‌‌‌‌‌కో ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఆ పిటిషన్లను 2017 ఆగస్టులో కొట్టేస్తూ.. ఈ వివాదాన్ని ఆర్డీవో తేల్చే వరకు స్టేటస్‌‌‌‌‌‌‌‌కో ఆర్డర్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉంటుందని షరతు విధించింది.  

ఈ ఏడాది మే నెలలో ఆర్డీఓతోపాటు ఇబ్రహీంపట్నం ఇనాం ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్లను విచారించి కొట్టేసింది. దాంతో భూమిని తమ పేరిట రిజిస్టర్ చేయాలని పిటిషనర్లు అంబర్‌‌‌‌‌‌‌‌పేట సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ ను కోరారు. దానికి సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ నిరాకరించారు. స్టేటస్‌‌‌‌‌‌‌‌కో ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఉన్నందున రిజిస్ట్రేషన్ చేయలేమని అభ్యంతరం తెలిపారు. కోర్టు నుంచి స్టేటస్‌‌‌‌‌‌‌‌కో ఆర్డర్ రద్దు కాపీని తేవాలని సూచించారు.  దాంతో పిటిషనర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాన్ని జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌వీ శ్రవణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ విచారించారు. 

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు స్టేటస్‌‌‌‌‌‌‌‌కో ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఏమీ లేకున్నా సరే.. ఉంది అని పేర్కొంటూ సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ అభ్యంతరం చెప్పడం చట్ట వ్యతిరేకమని కోర్టుకు తెలిపారు.  దీనిపై కోర్టు స్పందిస్తూ..అంబర్‌‌‌‌‌‌‌‌పేట సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. స్టేటస్‌‌‌‌‌‌‌‌కో ఆర్డర్ ఏమీ లేకున్నా ఉత్తర్వుల కాపీ తేవాలని కోరడమేంటని మండిపడింది. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించింది.  రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ తిరస్కరించడానికి కారణాలు వివరించేందుకు ఈ నెల 5న వ్యక్తిగతంగా హాజరై, వివరణ ఇవ్వాలని అంబర్‌‌‌‌‌‌‌‌పేట సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక నోట్‌‌‌‌‌‌‌‌ను తయారు చేసి రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులకు పంపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ(స్టాంపులు, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌) ముఖ్యకార్యదర్శి, జిల్లా రిజిస్ట్రార్లకు స్పష్టం చేసింది.